మంచాల, మార్చి 22 : ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం మంచాల మండలం ఆరుట్ల, బండలేమూరు గ్రామాల్లో రూ.1.60లక్షలతో అభివృద్ధి, శంకుస్థాపన పనులను ఎమ్మెల్యే సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో అన్ని గ్రామాల అభివృద్ధికి లక్షలాది రూపాయలను కేటాయించానన్నారు. దీంతో డబుల్ రోడ్లతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, వీధి దీపాలు, డ్వాక్రా భవనాలు, వైకుంఠధామాలను ఏర్పాటు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. పల్లెప్రగతితో చేపట్టిన పనుల వల్ల గ్రామాలు నేడు పరిశుభ్రంగా మారాయని ఎమ్మెల్యే తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటిని అందించి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుండా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ధ్వజమెత్తారు. పంజాబ్ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీ రాజేశ్వరి, ఉపసర్పంచ్ జంగయ్యగౌడ్, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.