వికారాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : గనుల అక్రమ తవ్వకానికి చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందుకోసం ప్రస్తుతమున్న లీజు పద్ధతికి స్వస్తి పలికి ఈ-వేలం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా గనుల ఈ-వేలం చేపడుతుండగా, వికారాబాద్ జిల్లాలోనూ అమలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గనులున్న ప్రాంతాలకు సంబంధించిన డీజీపీఎస్ మ్యాపులను సిద్ధం చేయడం, రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీలను సేకరించే పనుల్లో జిల్లా గనుల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
గనులకు ఈ-వేలం వేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న లీజు విధానానికి స్వస్తి పలికి వేలం వేసే విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా గనుల ఈ-వేలం విధానాన్ని అమలు చేస్తున్నారు. గనుల ఈ-వేలంపై జిల్లాలోనూ సంబంధిత అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో గనులున్న ప్రాంతాలకు సంబంధించిన డీజీపీఎస్ మ్యాపులను సిద్ధం చేస్తుండడంతోపాటు రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీలను సేకరించే పనిలో జిల్లా గనుల శాఖ అధికారులు ఉన్నారు. లీజుకిచ్చే పద్ధతితో ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం జరుగుతున్నదని భావించి ఈ-వేలం విధానంతో గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసేలా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగానే గత రెండేండ్లుగా ఒక్క అనుమతి కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
గనుల లీజుకిచ్చే విధానంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూరుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. లీజు ఒకచోట.. తవ్వకాలు మరోచోట అనే విధంగా కొంత ప్రాంతాన్ని లీజుకు తీసుకుంటున్న మైనింగ్ వ్యాపారులు లీజుకు తీసుకోని ప్రాంతాల్లో కూడా మైనింగ్ జరుపుతుండడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుతున్నది. గత రెండేండ్లుగా జిల్లావ్యాప్తంగా వెయ్యికిపైగా దరఖాస్తులురాగా.. సంబంధిత దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ-వేలం విధానంతో నిర్ణీత సమయానికి జిల్లావ్యాప్తంగా నిక్షిప్తమైన గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తారు కాబట్టి అక్రమ తవ్వకాలకు ఆస్కారముండదు. మరోవైపు ఈ-వేలం విధానంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుండడంతోపాటు అక్రమ గనుల తవ్వకాలకు పూర్తిగా చెక్ పడనుంది.
ఈ-వేలంతో మరింత ఆదాయం
జిల్లాలో మైనింగ్ లీజులైన పెద్ద తరహా, చిన్న తరహా గనుల ద్వారా ఏడాదికి రూ.50కోట్లు రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది. ఈ-వేలం విధానంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. జిల్లాలోని పెద్దేముల్, మర్పల్లి, వికారాబాద్, పరిగి మండలాల్లో 610 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఎర్రమట్టి గనులు., తాండూరు మండలంలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో 160 నాపరాతి గనులు, 12 హెక్టార్లలో 6 గ్రానైట్ గనులు., పెద్దేముల్, మర్పల్లి, ధారూరు మండలాల్లో 41 హెక్టార్ల విస్తీర్ణంలో 65 సుద్ద గనులు., వికారాబాద్, దోమ మండలాల్లో 86 హెక్టార్లలో 34 కంకర గనులు., దోమ మండలంలో 76 హెక్టార్లలో 6 పలుగురాళ్ల గనులున్నాయి.
ఈ-వేలం ప్రక్రియకు ఏర్పాట్లు : జిల్లా గనుల శాఖ ఏడీ సాంబశివరావు
ఇకపై గనుల అక్రమ తవ్వకాలకు పూర్తిగా చెక్ పడనుంది. జనవరి నుంచి గనుల లీజు విధానానికి బదులు ఈ-వేలం విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నాం. ఈ విధానానికి సంబంధించి డీజీపీఎస్ మ్యాప్స్‌ను సిద్ధం చేయడంతోపాటు రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీలను సేకరించే ప్రక్రియ కొనసాగుతున్నది.