ఆమనగల్లు, నవంబర్ 27 : ఓటు హక్కు విలువైనదని, 18 ఏండ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆమనగల్లు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను ఆయన సందర్శించి ఓటరు జాబితా, నమోదు సవరణల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు మాట్లాడుతూ నవంబర్ 26, 27 డిసెంబర్ 3, 4 తేదీల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఎల్వోలు ధనలక్ష్మి, విజయలక్ష్మి, స్వరూప, లక్ష్మి, రజిత, నాగమణి, తబిత, సంధ్య, రాజ్యలక్ష్మి, అనిత, లక్ష్మి, పుష్పలత పాల్గొన్నారు.
ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, తాసీల్దార్ గోపాల్ అన్నారు. పట్టణంలో కొనసాగుతున్న ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన యువతీయువకులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. అదే విధంగా ఓటరు కార్డులో పేర్ల మార్పులు, బూత్ మార్పు, తప్పులను సవరణలు చేసుకోవచ్చని వివరించారు. ఓటు నమోదు కోసం డిసెంబర్ 3, 4న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఎల్వో సిబ్బంది పాల్గొన్నారు.