రంగారెడ్డి, మార్చి 19, (నమస్తే తెలంగాణ) : సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేయకపోయినా గడపగలం కానీ కంటిచూపు లేకుండా బతుకడం మాత్రం చాలా కష్టం. పుట్టుకతో, ప్రమాదవశాత్తు కళ్లు పోయినవారి జీవితామంతా చీకటే. ఇలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా మనం చనిపోయిన తర్వాత కూడా మన కండ్లకు జీవితాన్నిచ్చే ఎంతో గొప్ప ఆలోచన వారిలో తట్టింది. ఇదే ఆశయంతో మానవత్వంలోనూ మాకు సాటిలేరని నిరూపించుకుంటున్నారు రంగారెడ్డి జిల్లాలోని ఆ గ్రామ ప్రజలు. ముందునుంచి సేవా దృక్పథంతో ఉన్న ఆ ఊరు జనం ఐక్యతతో ఓ గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు. 15 ఏండ్లకుపైగా అదే స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. బతికున్నప్పుడే కాదు, తాము మరణించిన అనంతరం కూడా మరొకరికి సహాయపడాలనే గొప్ప ఆశయంతో ఊరంతా నేత్రదానం చేసేందుకు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవల్లి గ్రామ ప్రజలు.
ఆలోచన వచ్చిందిలా..
పుట్టుకతో అంధుడైన దేవునిఎర్రవల్లికి చెందిన కావలి చంద్రయ్య పడిన కష్టాలను చూసిన సంబంధిత ఊరు జనంలో నేత్రదానం ఆలోచన వచ్చింది. మరణించే వరకు కావలి చంద్రయ్య చీకటి ప్రపంచంలోనే తన బతుకును ముగించాడు. ఆయన పడిన కష్టనష్టాలను చూసి ప్రజలు మరొకరు ఇలాంటి జీవితాన్ని అనుభవించొద్దనే ఆలోచనతో నేత్రదాన కార్యక్రమానికి 2007లో శ్రీకారం చుట్టారు. ఇదే గ్రామానికి చెందిన పట్లోళ్ల రంగారెడ్డి ప్రమాదానికి గురై ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఉస్మానియా దవాఖానలో సంబంధిత మృతుడి కుటుంబ సభ్యులతోపాటు వెంట వెళ్లిన ఊరు వారిని ఓ స్వచ్ఛంద సంస్థ నేత్రదానం చేయాలని, దీంతో మరొకరికి కంటి చూపును ప్రసాదించవచ్చని అవగాహన కల్పించారు. దేవునిఎర్రవల్లికి చెందిన అంధుడు కావలి చంద్రయ్యను గుర్తు చేసుకున్న వారు నేత్రదానం చేశారు. ఈ విధంగా 1200 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.
ఒక్కొక్కరిగా కదిలి..
ఉస్మానియా దవాఖానలో రాంరెడ్డి నేత్రాలను దానం చేసిన అనంతరం ఊరు పెద్దలంతా సమావేశమై మనం చనిపోయిన తర్వాత కూడా మరొకరికి కంటి చూపునిచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అప్పటి సర్పంచ్ చింపుల సత్యనారాయణరెడ్డి అనుకున్నారు. అనుకున్నదే తడవుగా గ్రామ ప్రజలందరికీ తెలిపారు. నెలరోజులపాటు ఇంటింటికీ వెళ్లి గ్రామ సర్పంచ్‌తోపాటు పెద్దలంతా ప్రజలకు అవగాహన కల్పించారు. నేత్రదానంతో మరొకరికి కొత్త జీవితాన్ని ఇయ్యొచ్చేనేది గ్రామస్తులందరికీ తెలియజేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు గ్రామస్తులను ఒప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. మొత్తం గ్రామస్తులు 1200 మంది నేత్రదానం చేస్తూ అంగీకార పత్రాలపై సంతకాలు చేసి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సరోజిని కంటి దవాఖాన యాజమాన్యంతో ఈ ఊరి ప్రజలు అంగీకారం చేసుకున్నారు. 15 ఏండ్లకుపైగా ఊర్లో ఎవరూ మరణించినా, సరోజిని దవాఖాన నిర్వాహకులకు సర్పంచ్ సమాచారమందిస్తున్నారు. ఇప్పటివరకు మరణించిన 29 మంది నేత్రాలను వారి కుటుంబ సభ్యులు దానం చేశారు.
మరో రెండు గ్రామాలు..
దేవుని ఎర్రవల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని మరో రెండు గ్రామాలు నేత్రదానానికి ముందుకొచ్చాయి. చేవెళ్ల మండలంలోని చన్వెల్లి ఆమ్లెట్ గ్రామమైన ఇక్కారెడ్డిగూడతోపాటు మొయినాబాద్ మండలంలోని చిలుకూరు ప్రజలు దేవునిఎర్రవల్లిని స్ఫూర్తిగా తీసుకొని నేత్రదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇక్కారెడ్డి గ్రామంలోని 480 మంది నేత్రదానం చేస్తూ ఎల్వీ ప్రసాద్ కంటి బ్యాంకుతో అంగీకారం చేసుకొని సంతకాలు చేశారు. ఏడేండ్లలో మరణించిన 9 మంది నేత్రాలను వారి కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన నిర్వాహకులకు నేత్రాలను దానం చేశారు. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో 8వేల మంది జనాభా ఉండగా, 4090 మంది ప్రజలు నేత్రదానం చేసేందుకు సరోజిని కంటి దవాఖానతో అంగీకారం చేసుకొని సంతకాలు చేశారు.
మా గ్రామం ఆదర్శంగా నిలవాలన్నదే లక్ష్యం..
మా గ్రామం జిల్లాలో ఆదర్శంగా నిలవాలనే ఆలోచనతోపాటు సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో నేత్రదానానికి ముందుకొచ్చారు. మరణించిన తర్వాత మన శరీరం మట్టిలో కలిసిపోతుంది, కండ్లు దానం చేసినట్లయితే మనం భౌతికంగా లేకపోయినప్పటికీ మరొకరికి చూపునివ్వడంతోపాటు మన కండ్లు సజీవంగా ఉంటాయి. ఆరేండ్ల క్రితం గ్రామ ప్రజల్లో వచ్చిన చైతన్యంతో నా కండ్లు దానం చేస్తామని అంగీకార పత్రంపై రాసి ఇచ్చారు.
– గున్గుర్తి స్వరూప, చిలుకూరు సర్పంచ్
ఎవరు చనిపోయినా నేత్రదానం చేస్తాం
మా గ్రామంలో ఎవరు చనిపోయినా నేత్ర దానం చేస్తున్నాం. మా తండ్రి ఎదిరే ఎల్లయ్య గతేడాది జనవరి 6వ తేదీన చనిపోవడంతో నేత్రదానం చేశాం. నేత్రదానం చేయడంతో చూపులేని వారికి చూపు ఇచ్చినవాళ్లమవుతామని స్వచ్ఛందంగా నేత్రదానం చేస్తున్నాం. నేత్రదానం చేయడంలో మా గ్రామం ఆదర్శంగా నిలిచింది.
– శ్రీశైలం, దేవుడి ఎర్రవల్లి
నేత్రదానం చేయడం మంచి నిర్ణయం
15 సంవత్సరాలుగా మా గ్రామంలో నేత్రదానం చేస్తున్నాం. దీంతో మరొకరికి కంటి చూపును ఇవ్వవచ్చు. నేటి సమాజంలో చూపు లేక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఎందుకంటే ఏది కొన్న దొరుకుతుంది కాని నేత్రాలు మాత్రం దొరకవు. 12ఏండ్ల క్రితం మా తండ్రి మాణిక్యరెడ్డి చనిపోవడంతో నేత్రాలు దానం చేశాం.
-మాణిక్యం, దేవుని ఎర్రవల్లి