రంగారెడ్డి, మార్చి 19, (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ దిశగా ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఖాళీల భర్తీకి అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ప్రత్యక్ష నియామక పద్ధతిలో చేపట్టాల్సిన ఖాళీల భర్తీని జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. మిగతా పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలతోపాటు అన్ని శాఖల్లోని జిల్లాస్థాయి, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. జిల్లా క్యాడర్ పోస్టులైన టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, డ్రైవర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, జమేదార్, చైన్మన్, ధపేదార్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్, స్వీపర్, వాచ్మెన్, గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి తదితర పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా జోనల్ పోస్టులైన డిప్యూటీ తాసిల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఎస్ఐ, తదితర పోస్టులకు సంబంధించి చార్మినార్ జోన్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతోపాటు జిల్లా నిరుద్యోగులు పోటీ పడనున్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహించి భర్తీ చేయనున్నారు. అదేవిధంగా త్వరలో భర్తీ చేయనున్న పోస్టుల్లో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు రానున్నాయి. మిగతా 5 శాతంలో స్థానికులతోపాటు స్థానికేతరులు కూడా పోటీ పడనున్నారు. అంతేకాకుండా ఇకపై ప్రతి ఏటా ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించి క్యాలెండర్‌ను కూడా ప్రకటించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యాశాఖలో 705 పోస్టుల ఖాళీలు
జిల్లా విద్యాశాఖలోని పోస్టుల ఖాళీలకు సంబంధించి సంబంధిత అధికారులు లెక్కతేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 80,039 వేల పోస్టులను భర్తీ చేసేందుకుగాను ప్రభుత్వం ప్రకటించగా, వీటిలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జిల్లా క్యాడర్ పోస్టుల ఖాళీలు 1561 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జిల్లాలో ఖాళీగా పోస్టుల్లో విద్యాశాఖలో 705 పోస్టులు ఖాళీలున్నాయి. విద్యాశాఖలో ఉన్న పోస్టుల ఖాళీలకు సంబంధించి పదోన్నతుల ద్వారా 311 పోస్టులు ఖాళీలు ఏర్పడగా, ప్రత్యక్షంగా నియామకానికి సంబంధించి 394 పోస్టులు ఖాళీలున్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. విద్యాశాఖలోని స్థానిక సంస్థల స్కూళ్లలో పోస్టుల ఖాళీల్లో అత్యధికంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 253 పోస్టులు ఖాళీలున్నాయి.
గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు-67, పీఎస్‌హెచ్‌ఎం-65 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్(తెలుగు మీడియం)-17, స్కూల్ అసిసెంట్ మ్యాథ్స్(ఉర్దూ మీడియం)-3, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్(తెలుగు మీడియం)-5, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్(ఉర్దూ మీడియం)-2, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్(తెలుగు మీడియం)-54, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్(ఉర్దూ మీడియం)-4, స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం(తెలుగు మీడియం)-96 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం(ఉర్దూ మీడియం)-6 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు-26, స్కూల్ అసిస్టెంట్ హిందీ-10, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్-17, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ-1, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్(తెలుగు మీడియం)-3 పోస్టులు, తెలుగు లాంగ్వేజ్ పండిట్-14, హిందీ లాంగ్వేజ్ పండిట్-8, పీఈటీ తెలుగు మీడియం-4, ఎస్జీటీ తెలుగు-181, ఎస్జీటీ ఉర్దూ-20, ఎస్జీటీ ఇంగ్లిష్-33, ఆర్ట్-డ్రాయింగ్ టీచర్(తెలుగు మీడియం)-10, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ (తెలుగు)-1, క్రాఫ్ట్ టీచర్(తెలుగు)-20, ఎంటీఐ-పీవీఐ-ఎస్ఐ(తెలుగు)-1 పోస్టు ఖాళీలున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీలకు సంబంధించి గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు-2, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్(తెలుగు మీడియం)-1, స్కూల్ అసిస్టెంట్ హిందీ-2, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్-4, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్(తెలుగు)-2, ఎస్జీటీ తెలుగు-5, ఎస్జీటీ ఉర్దూ-9, ఆర్ట్-డ్రాయింగ్ టీచర్(తెలుగు)-2, మ్యూజిక్ టీచర్(తెలుగు)-1 పోస్టు ఖాళీలున్నాయి. నాన్-టీచింగ్‌లో భాగంగా 9 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఉపాధ్యాయ ఖాళీల వివరాలు ప్రభుత్వానికి అందజేత
పరిగి, మార్చి 19 : ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగిరం చేసింది. ఇందులో భాగంగా అత్యధికంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించడం ద్వారా పూర్తిస్థాయిలో ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నది. జిల్లా పరిధిలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వివరాలు సేకరించింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో 600 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు జిల్లాలోని ఆయా పాఠశాలల వారీగా ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు విద్యా శాఖ అధికారులు ఉన్నతాధికారులకు పంపించినట్లు సమాచారం.
జిల్లాలో 600 పోస్టులు ఖాళీ..
వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 1034 పాఠశాలలుండగా వాటిలో మంజూరైన పోస్టులు 4616 ఉన్నాయి. జిల్లా పరిధిలోని పాఠశాలల్లో 4016 మంది ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 600 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాల్లోని ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వివరాలు సేకరించడంతో ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలు అందజేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలను సర్కారు చేపట్టనున్నది. ఇందులో మొదటి విడుతలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అవసరమైన మేరకు చర్యలు చేపట్టింది. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే సంవత్సరం నుంచి ఉద్యోగ నియామకాల క్యాలెండర్ సైతం ప్రకటించనున్నారు. తద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా చేపట్టి ఇబ్బందులు దూరం చేయనున్నారు.
ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నది. మొదటి విడుతలో వికారాబాద్ జిల్లా పరిధిలో 371 పాఠశాలలు ఎంపిక చేశారు. 12 అంశాల్లో సదుపాయాలు కల్పించేందుకు నిర్ణయించి, ప్రస్తుతం ఆయా పనులకు సంబంధించిన అంచనాలు తయారు చేయడంలో ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు 317 జీవో పలు ఉపాధ్యాయ పోస్టుల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు నియమించబడ్డారు. పూర్తిస్థాయిలో నియామకానికి సర్కారు చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 600 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టనున్నది. త్వరలోనే ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది.