రంగారెడ్డి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి నేతృత్వంలో సమీక్షా సమావేశం సుమారు 40 ప్రధాన అంశాలపై జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి సంబంధించిన ఎజెండాలోని అంశాలపై జడ్పీ చైర్ పర్సన్ చర్చను ప్రారంభించారు. అనంతరం, మంత్రి మాట్లాడుతూ.. ఎజెండాలోని అంశాలవారీగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు పరిష్కార మార్గాలు చేపట్టాలని సూచించారు. జిల్లా విద్యా శాఖ అధికారి సుశీందర్‌రావు, మౌలిక వసతులపై చర్చిస్తూ ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడుతలో 464 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థులకు కావాల్సిన వసతులు, మరమ్మతులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించామని సభ్యులకు తెలిపారు. జిల్లాలో కొన్ని చోట్ల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. స్పందించిన మంత్రి.. ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. గ్రామీణ అభివృద్ధి శాఖపై చర్చిస్తూ జిల్లాలో అర్హులైన వారికి ఆసరా ఫించన్లు అందించామని, మిగిలినవారికి కూడా త్వరలోనే అందిస్తామని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సభ్యులకు తెలియజేశారు.
ప్రమాదాలు జరుగకుండా చర్యలు
జిల్లాలో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. నివారణకు చర్యలు తీసుకోవాలని జడ్పీ సభ్యులు ఆర్అండ్ బీ, ఈఈపీఆర్ అధికారులను కోరారు. రోడ్ల మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సంబంధిత సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కచ్చితంగా వైద్యుడు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు. జిల్లా పంచాయతీ శాఖ, మైనింగ్, వ్యవసాయం, సంక్షేమం, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి పలు సమస్యలను సమీక్షించారు. ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ సభ్యులు అడిగిన పలు రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జిల్లా ప్రజా పరిషత్ సీఈవో దిలీప్‌కుమార్, కో ఆప్షన్ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.