ధారూరులో వందేండ్ల మెథడిస్టు చర్చి ఉత్సవాలను మంగళవారం బిషప్‌లు డాక్టర్ డానియేల్, ఎన్ఎల్ కర్కరే తదితరులు ప్రారంభించగా, అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి సుధారాణి, డీఎల్పీవో అనిత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ధారూరు, నవంబర్ 15 : మండల పరిధిలోని ధారూరు స్టేషన్ మెథడిస్టు జాతర మంగళవారం బిషప్‌లు డాక్టర్ ఎంఏ డానియేల్, ఎన్ఎల్ కర్కరే, డాక్టర్ ఆశా డానియేల్ ప్రారంభించారు. అనంతరం జాతర ముఖద్వారం నుంచి పాదయాత్రతో బిషప్‌లు, పాస్టర్లు తదితర వారితో కలిసి ఏసుక్రీస్తు శిలువ వద్దకు వచ్చి ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రసంగించారు. మంగళవారం నుంచి ఆదివారం వరకు జరిగే 100వ జాతరకు భారీ సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. జాతర ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు, జాతర కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి సుధారాణి, డీఎల్పీవో అనిత జాతర ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు జాతర ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.
జాతరకు ప్రత్యేక బస్సులు
వికారాబాద్ డిపో నుంచి ప్రతి రోజూ జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ మహేశ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రికుల సౌకర్యార్థం వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద, బస్ స్టేషన్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివరాలకు 7382832737కు ఫోన్ చేయాలని కోరారు.