వికారాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన గిరిజన తండాలు, మారుమూల పల్లెలు సైతం సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడంతో పలు గ్రామాలకు మహర్దశ వచ్చింది. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామాలు నేడు పచ్చని మొక్కలు, సీసీరోడ్లు, డ్రైనేజీలతో సమస్య రహితంగా మారాయి. వికారాబాద్ జిల్లాలో మొత్తం 209 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటుకాగా, వీటిలో 98 తండాలున్నాయి. కొత్త జీపీలకు సర్కార్ ప్రాధాన్యమిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నది. జిల్లావ్యాప్తంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి నెల రూ.10 కోట్ల అందిస్తూ అభివృద్ధి చేస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతులను కల్పిస్తున్నది. దీంతో ఏ గ్రామానికెళ్లినా అద్దంలా మెరిసే రోడ్లు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, పచ్చని మొక్కలే దర్శనమిస్తున్నాయి. పంచాయతీకో ట్రాక్టర్ అందించడంతో నిత్యం చెత్త సేకరణ, మొక్కలకు నీటి సరఫరా చేయడంతో గ్రామాలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో మెరిసిపోతున్నాయి.
ఒకప్పుడు ఏమాత్రం అభివృద్ధికి నోచని గిరిజన తండాలు, అనుబంధ గ్రామాల్లో ప్రస్తుతం అభివృద్ధి పరుగులు పెడుతున్నది. అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న గిరిజన తండాలతోపాటు అనుబంధ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ నాలుగేండ్ల క్రితం కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతో గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలకు మంచి రోజులొచ్చాయి. గిరిజన తండాల ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. నాలుగేండ్లలోనే పాత పంచాయతీలకు దీటుగా కొత్త పంచాయతీల్లో అభివృద్ధి జరుగడం గమనార్హం. టీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామపంచాయతీల్లో సమూల మార్పులు వచ్చాయి.
ప్రతి నెలా నిధులు విడుదల
జిల్లాలో ప్రస్తుతం 566 గ్రామపంచాయతీలున్నాయి. వీటిలో నాలుగేండ్ల క్రితం 209 నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటుకాగా.. వీటిలో 98 గిరిజన తండాలున్నాయి. గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలు గ్రామపంచాయతీలుగా ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ గ్రామపంచాయతీల అభివృద్ధిలో ఏ మాత్రం భేదం లేకుండా పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నెలకు జిల్లాలోని గ్రామ పంచాయతీలన్నింటికీ కలిపి రూ.10 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. మండల కేంద్రం నుంచి గ్రామపంచాయతీలకు రహదారులను నిర్మించారు. ప్రతి కాలనీలోనూ సీసీ రోడ్లను నిర్మించారు.
వంద శాతం పన్ను వసూలు
మరోవైపు కొత్తగా ఏర్పాటైన ప్రతి గ్రామపంచాయతీకి సొంత పంచాయతీ భవనాలు ఉండాలనే ఉద్దేశంతో నూతన పంచాయతీ భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. గతంలో గిరిజన తండాల్లో అభివృద్ధిని విస్మరించడంతో పన్ను వసూలు ఏ మాత్రం ఉండేది కాదు. ప్రస్తుతం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో గ్రామపంచాయతీలుగా ఏర్పాటైన తండాల్లో వంద శాతం పన్ను వసూలు జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి పథంలోకి తీసుకురావడంతో ఆస్తి పన్ను చెల్లించేందుకు గిరిజన తండాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
గామాల్లో సమూల మార్పులు
టీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామల్లో సమూల మార్పులు వచ్చాయి. ఎప్పుడో పాతికేండ్ల క్రితం రూపొందించిన పంచాయతీరాజ్ చట్టానికి స్వస్తి పలికిన సీఎం కేసీఆర్ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. నూతన చట్టం ప్రకారం ప్రతి నెల గ్రామపంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం, పల్లెప్రగతి తదితర కార్యక్రమాలను చేపట్టడంలాంటి పనులు చేపట్టారు. ప్రతి గ్రామంలో నర్సరీ, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, చివరి మజిలి గౌరవంగా నిర్వహించేందుకుగాను శ్మశానవాటికలను నిర్మించారు.
పల్లె ప్రగతితో..
కొత్త గ్రామపంచాయతీలకు తాగునీటి పైప్‌లైన్ వేయడంతోపాటు పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలన్నీ స్వచ్ఛ గ్రామపంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయి. పారిశుధ్య పనులతోపాటు శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించడం, ముళ్ల పొదలను తొలగించడం, తడి-పొడి చెత్తను సేకరించడం తదితర స్వచ్ఛ కార్యక్రమాలను చేపడుతున్నారు. కొత్త గ్రామపంచాయతీల్లో నిధులు లేకపోయినప్పటికీ ప్రభుత్వం ట్రాక్టర్లను కొనుగోలు చేసి అందజేసింది. సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, కూరగాయల పందిళ్లు, కల్లాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలను నిర్మించారు.