ఇబ్రహీంపట్నం, నవంబర్ 13 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎంతోమంది పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. యాచారం మండల పరిధిలోని తులేఖుర్దు గ్రామంలో అంకని జంగయ్య అనే వ్యక్తికి దళితబంధు కింద మంజూరైన బట్టల దుకాణాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతోమంది పేద దళితుల సంక్షేమం కోసం ఈ దళితబంధు పథకం తోడ్పాటునిస్తున్నదన్నారు. ఆర్థికంగా వెనుకబడి దీనస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనస్సుతో ఆదుకోవటం గర్వకారణమన్నారు. నియోజకవర్గంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్క దళితునికి ఈ పథకం వర్తిస్తుందని ఆయన గుర్తు చేశారు. దళితబంధు కింద వివిధ యూనిట్ల రూపంలో మంజూరైన వాటిని సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధ్ది చెందాలని సూచించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, సర్పంచ్ సబిత, టీఆర్ఎస్ నాయకులు యాదయ్య, సత్యపాల్, గోపాల్, వెంకటేశ్, ఈశ్వర్, ఆనంద్ ఉన్నారు.
ఘనంగా అయ్యప్పస్వామి మహాపడిపూజ
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్పస్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహాపడిపూజకు ఇబ్రహీంపట్నంతో పాటు మంచాల, యాచారం మండలాల నుంచి అయ్యప్పస్వామి భక్తులు, పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్పస్వామి కృపతో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అయ్యప్పస్వామి భక్తులు పాల్గొన్నారు.
క్రీడా ప్రాంగణం ప్రారంభం
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీ పరిధి 5వ వార్డు పెద్దఅంబర్‌పేటలోని సదాశివ హెవెన్స్‌లో రూ.5 లక్షల నిధులతో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాన్ని ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. క్రీడా ప్రాంగణాలకు ఎంతగానో ఆదరణ ఉంటున్నదని చెప్పారు. అనంతరం సదాశివ హెవెన్స్‌లో నిర్మించిన గణపతి మండపాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సదాశివలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంచిరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను ప్రజలు నమ్మబోరని గాదరి కిశోర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణారెడ్డి, కమిషనర్ రామాంజులరెడ్డి, కౌన్సిలర్లు సిద్దెంకి కృష్ణారెడ్డి, అనురాధ, అర్చన, రోహిణిరెడ్డి, అనుపమరెడ్డి, విద్యారెడ్డి, హరిశంకర్, దండెం కృష్ణారెడ్డి, రాజేందర్, పరశురాం నాయక్, కోటేశ్వరరావు, నాయకులు దామోదర్, విజయ్‌శేఖర్‌రెడ్డి, కంచర్ల సత్యనారాయణరెడ్డి, జగన్, చిరంజీవి, రాజిరెడ్డి, ఇబ్రహీం, సదాశివ కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మహంకాళికి ప్రత్యేక పూజలు
అంతకుముందు అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని తారామతిపేట గ్రామంలో నిర్వహిస్తున్న మాతా మహంకాళి కుంభాభిషేకం కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్‌తో కలిసి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఎంపీటీసీ వెంకటేశ్‌యాదవ్, ఉపసర్పంచ్ గొశిక నర్సింహ, ఇతర గ్రామ పెద్దలు స్వాగతం పలికారు. జ్ఞాపికతో సత్కరించారు.
తుర్కయాంజాల్ : భక్తిశ్రద్ధలతో దైవనామస్మరణ చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ లక్ష్మీనగర్ కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ శ్రీ సీతారామచంద్ర స్వామి సమేత దేవస్థాన ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి జైరాం గురుస్వామి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మునగనూర్‌లో నిర్వహించిన వన భోజన మహోత్సవాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ కల్యాణ్ నాయక్, నాయకుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.