కులకచర్ల, నవంబర్ 13: కులకచర్ల మండల కేంద్రానికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న తిర్మలాపూర్ గ్రామ పంచాయతీలో 750 మంది జనాభా ఉంది. 560 పైగా ఓటర్లు ఉన్నారు. గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో బండమీదితండా, లాల్సింగ్తండా గ్రామాలు తిర్మలాపూర్ గ్రామంలో ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన నిమిత్తం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో రెండు గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. గ్రామ సర్పంచ్ వెంకటమ్మ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సహకారంతో గ్రామంలో పల్లె ప్రగతి పనులు పూర్తిచేశారు. ఇంటింటికీ నల్లాతో తాగునీటి సౌకర్యం, వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వల ఏర్పాటు వంటివి జరిగాయి. డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం నిర్మించారు. మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా ఇంటింటికీ నల్లాను ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీ బోర్ల ద్వారా నీటిని అందించేవారు.
దీనివలన అప్పుడప్పుడు తాగునీటి సమస్యకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కాని మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించడం వలన గ్రామంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేశారు. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటారు. అల్ల నేరెడు, దానిమ్మ, అశోక, మందారం, బొడ్డుమల్లే, నీలగిరి, కొబ్బెరి మొక్కలునాటారు. గ్రామానికి వెళ్లేదారి, చౌడాపూర్ రోడ్డుకు పక్కల ఏర్పాటు చేసిన ప్రకృతి వనం ప్రజలకు ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నది. గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో చెత్త ఎక్కడ కూడ పడకుండా ఉండేందుకు పంచా యతీ ఆద్వర్యంలో ట్రాక్టర్ ద్వారా చెత్తను చేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మురుగునీటి కాల్వలను శుభ్రం చేయడంతో పాటు మురుగునీటిని నిల్వ ఉంచకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నిధులను జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాం
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాం ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీటి అందిస్తు న్నాం. ప్రతి రోజు చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలి స్తున్నాం. ప్రజలకు అన్ని విధా లుగా మౌలిక సౌకర్యాలు కల్పిస్తు న్నాం. –వెంకటమ్మ, సర్పంచ్
గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం
తిర్మలాపూర్ గ్రామాన్ని గ్రామస్తుల సహకారంతో ఆదర్శగ్రా మంగా తీర్చి దిద్దుతాం. గ్రామంలో ప్రభుత్వం సూచించిన అన్ని విధాలా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం. గ్రామ ప్రజల, వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
– శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి