మంచాల, నవంబర్ 13 : ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలోని బుగ్గరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు సుమారు రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భక్తుల కాలినడకన చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్తిక పుణ్యస్నానాలను ఆచరించేందుకు భక్తులు గుండం వద్ద క్యూ కట్టారు. అనంతరం గుండంలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించారు. మహిళలు తులసి కోట, శివలింగం వద్ద కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగన్న పుట్ట, నర్సింహబాబా సమాధితోపాటు కబీర్దాస్ మందిరంలో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వనభోజనాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వెలసిన దుకాణాల్లో స్వీట్లు, ఆటవస్తువులు, గాజులు తదితరాలు కొనుగోలు చేశారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంచాల సీఐ వెంకటేశ్‌గౌడ్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. వాహనాలకు మూడు చోట్ల పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుమారు వందమంది పోలీసుల బందోబస్తుతోపాటు 15 సీసీ కెమెరాలతో ఎప్పడికప్పుడు పర్యవేక్షించారు. ఇబ్రహీంపట్నం నుంచి ప్రతి 10 నిమిషాలకోసారి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం కూడా అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారు.