సకల వసతులతో నిర్మించిన రైతు వేదికలు చైతన్య దీపికలై అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
అన్నదాతల సేవలో రైతు వేదిక భవనాలు
సజావుగా సమావేశాలు, సదస్సుల నిర్వహణ
రంగారెడ్డిజిల్లాలో 83 క్లస్టర్లలో భవనాల నిర్మాణం
సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు
షాబాద్, నవంబర్ 13 : సకల వసతులతో నిర్మించిన రైతు వేదికలు చైతన్య దీపికలై అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా సమావేశాలు, సదస్సుల నిర్వహణకు సౌకర్యవంతంగా మారాయి. అధునాతన వ్యవసాయ పద్ధతులు, పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై అధికారులు అవగాహన కార్యక్రమాలు ఇందులోనే నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 83 వ్యవసాయశాఖ క్లస్టర్ల పరిధిలో 83 రైతువేదిక భవనాలను నిర్మించారు. ఈ సమావేశాల్లో వ్యవసాయశాఖ అధికారులతో పాటు రైతుబంధు సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రైతుల సందేహాలు నివృత్తి చేస్తుండగా.. రైతు వేదికలు అధ్యయన కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఈ యాసంగిలో జిల్లాలో 95,042 ఎకరాల్లో వివిధ పంటలు సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా.. కొత్త రకాల పంటలు, కూరగాయల సాగును పెంచే దిశగా రైతులను చైతన్యపరుస్తున్నారు.
తెలంగాణలో వ్యవసాయం చేస్తున్న రైతులకు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో రైతు వేదికలను ఏర్పాటు చేసింది. రైతు ఏ సీజన్లో ఏ పంట వేయాలి.. వేసిన పంటలకు ఏఏ మందులు పిచికారీ చేయాలనే వివరాలను రైతులకు సమావేశాలు నిర్వహించి వ్యవసాయశాఖ అధికారులు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 83 వ్యవసాయ శాఖ క్లస్టర్ల పరిధిలో ప్రభుత్వం 83 రైతువేదికలను నిర్మాణం చేసింది. ఇందులోనే అధికారులు పంటల సాగుపై సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతు వేదికలు అన్నదాతలకు అధ్యయన కేంద్రాలుగా మారుతున్నాయి. సమావేశాల్లో వ్యవసాయశాఖ అధికారులతోపాటు రైతు బంధు సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రైతుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు. యాసంగిలో రైతులు సాగు చేసే పంటలపై అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్నదాతలకు వివరిస్తున్నారు.
జిల్లాలో 83 రైతు వేదికల్లో సదస్సులు
జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు(కల్వకుర్తి), రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల పరిధిలో 83 రైతువేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యాసంగిలో జిల్లాలో 95,042 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. లాభదాయక పంటలను ప్రోత్సహించేలా సీఎం కేసీఆర్ మార్పులు తీసుకువస్తున్నారు. రైతులు సాగుచేసే పంటలపై రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తుండడంతో పంటల సాగుకు ముందు నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సలహాలు, సూచనలు అందించడంతోపాటు సందేహాలను నివృత్తి చేస్తున్నారు. సాగుపై ఆధారపడి జీవనం సాగించే రైతులకు నష్టం కలుగకుండా సర్కారు చర్యలు చేపడుతున్నది.
యాసంగి పంటలపై అవగాహన
ప్రస్తుతం యాసంగిలో రైతులు సాగుచేసే పంటలపై అధికారులు రైతు వేదికల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రకాల పంటలు, కూరగాయలు సాగు చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రైతు అవగాహన సదస్సుల్లో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పాల్గొని సాగుపై రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ముఖ్యంగా నూనెగింజలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశెనగ, మొక్కజొన్న పంటలను సాగు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీటితో త్వరగా పంట చేతికొచ్చే పంటలను సాగుచేసేలా అన్నదాతలను ప్రోత్సహిస్తున్నారు.
పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం
– గీతారెడ్డి, రంగారెడ్డిజిల్లా వ్యవసాయశాఖ అధికారి
ప్రస్తుతం యాసంగి సీజన్‌కు గాను పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏ పంటలు వేయాలి..? ఏఏ మందులు పిచికారీ చేయాలనే అంశాలపై జిల్లా వ్యాప్తంగా 83క్లస్టర్ల పరిధిలోని రైతువేదికల్లో తమ సిబ్బందితో కలిసి సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఒకే రకమైన పంటలు సాగు చేయడంతో నేలసారంపై వివరించడం, కొత్త రకం పంటలతో వచ్చే లాభాలను రైతులకు తెలియజేస్తున్నాం. సమావేశాలకు రైతులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.
రైతులకు ఎంతో మేలు జరుగుతుంది
– మధుసూదన్‌రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు, షాబాద్
పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడం గొప్ప నిర్ణయం. గతంలో రైతులకు అవగాహన లేకపోవడంతో ఏ పంటలు వేయాలో తెలియక నష్టపోయేవారు. రైతుబిడ్డగా సీఎం కేసీఆర్ ప్రతి క్లస్టర్‌కు ఒక రైతువేదిక ఏర్పాటు చేసి యాసంగి, వానకాలం పంటల సాగుపై ముందుగానే వ్యవసాయశాఖ అధికారులతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అధికారుల సూచనల మేరకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు.