సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై వివిధ పద్ధతులు అనుసరించడంలో భాగంగా.. మరో నూతన విధానానికి ఆర్టీసీ గ్రేటర్ అధికారులు శ్రీకారం చుట్టారు. నగరంలోని పలు ప్రాంతాలైన సికింద్రాబాద్, కూకట్పల్లి వంటి మార్గాల నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండే హైటెక్ సిటీకి ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం ఆర్టీసీ గ్రేటర్ అధికారులు ఈ మేరకు ఏర్పాటు చేశారు. అయితే ఈ సారి మరో అండుగు ముందుకు వేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తూనే.. సాఫ్ట్వేర్ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు అద్దె బస్సులు ఏర్పాటు చేసే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసీఐఎల్, ఉప్పల్, దిల్‌సుక్‌నగర్, సికింద్రాబాద్ ఇలా.. నగరంలోని పలు ప్రాంతాల నుంచి నేరుగా సాఫ్ట్వేర్ కంపెనీలకే చేరుకునే విధంగా అద్దె బస్సులను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై శుక్రవారం రాత్రి దాదాపు 20 పైగా సాఫ్ట్వేర్ కంపెనీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ) ఈ. యాదగిరి తెలిపారు. ఆర్టీసీ నుంచి అద్దెబస్సులు తీసుకున్న సాఫ్ట్వేర్ సంస్థలు కేవలం తమ సంస్థ ఉద్యోగుల కోసం వీటిని ఉపయోగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కిలో మీటర్ల వారీగా ప్రత్యేక చార్జీలు..
సాఫ్ట్వేర్ సంస్థలకు అద్దెకు ఇవ్వాలనుకున్న బస్సులకు కిలోమీటర్ల వారీగా చార్జీలు వసూలు చేయనున్నారు. అందుకు సంబంధించి చార్జీలు విడుదల చేశారు. సిటీ ఆర్డినరీ బస్సుకు కనీసం 40 నుంచి 79 వరకు కిలోమీటర్లు ఉన్న అద్దె బస్సులకు నెలకు రూ.59,280, 80పైగా కిలోమీటర్లకు రూ.1,20,240 వసూలు చేయనున్నారు. అలాగే మెట్రో ఎక్స్‌ప్రెస్ అద్దె బస్సుకు కనీసం 40 నుంచి 79 లోపు కిలోమీటర్లకు రూ.64,480 వసూలు చేయనుండగా.. 80 పైగా కిలోమీటర్ల ఉన్న బస్సులకు రూ.1,18,560 వసూలు చేయనున్నారు. అలాగే మినీ బస్సులకు విషయానికొస్తే.. 40 నుంచి 79 కిలోమీటర్ల లోపు రూ.60,320 వసూలు చేయాలని, 80పైగా కిలోమీటర్లు ఉన్న వాటికి రూ.1,06,080 చొప్పున అద్దె బస్సుల చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ అధికారులు తెలిపారు.
మెట్రోస్టేషన్‌కు ఆర్టీసీ బస్సుల అనుసంధానం..
హైటెక్, రాయదుర్గం వంటి సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్న మెట్రో స్టేషన్‌కు ఆర్టీసీ సిటీ బస్సులను అనుసంధానం చేయనున్నారు. దీనిపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడ్డారు.