దోమ, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వం దేశ రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక చేయూతనివ్వాలని పీఎం కిసాన్ పథకాన్ని 10/04/2018లో అమలులోకి తీసుకువచ్చింది. 10/04/2018-31/01/2019 (తొమ్మిది నెలలు) కాలంలో పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతులకు మాత్రమే వర్తించేలా నిబంధన పెట్టింది. సంవత్సర కాలంలో మూడు సీజన్లలో 4 నెలలకోసారి రూ.2000 చొప్పున 6000 నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా పీఎం కిసాన్ పథకాన్ని తెచ్చారు. రైతులకు ఎంత భూమి ఉన్నా.. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పీఎం కిసాన్ కింద డబ్బులు అందుతాయి. 2019 అనంతరం రైతులు ఈ-కేవైసీ చేసుకున్నా ఇప్పటివరకు డబ్బులు వారి ఖాతాల్లో జమ కాలేదు.
దోమ మండల పరిధిలోని 36 గ్రామపంచాయితీల్లో మండలవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకానికి అర్హత కలిగినవారు 6942 మంది ఉన్నారు. కాని ఈ పథకంలో లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 4020 మంది మాత్రమే. మిగతా 2922 మంది ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. తాము కేంద్ర ప్రభుత్వం దృష్టిలో రైతులము కామా.. మాకెందుకు అన్యాయం చేస్తున్నారు.. అందరితోపాటు మాకూ అవకాశం కల్పిస్తే లబ్ధి పొందుతామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారికి ప్రతి సీజన్లో అవకాశం కల్పించినట్లు.. కేంద్ర సర్కారు ఇలాంటి అవకాశాన్ని కల్పించి చేయూతనివ్వాలని రైతులు కోరుతున్నారు. పీఎం కిసాన్ కొందరికే ఎందుకు.. అందరికి అందేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం అభ్యర్థిస్తున్నది.
రైతులందరికీ అవకాశం కల్పించాలి: సీత్వ బాల్రాజ్, రైతు, మోత్కూర్
మోత్కూర్ గ్రామంలో నేను కొత్త పట్టాదారు పాసు పుస్తకం తీసుకొని 08/10/2021లో పీఎం కిసాన్ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇప్పటి వరకు పీఎం కిసాన్ డబ్బులు అందలేదు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన పీఎం కిసాన్ పథకంలో 2019 తరువాత కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులను పథకంలో భాగస్వాములను చేసి అవకాశం కల్పించేలా సముచిత నిర్ణయం తీసుకొని రైతులందరికీ అవకాశం కల్పించి న్యాయం చేయాలి.
పీఎం కిసాన్ అందేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి: హెచ్.సత్యయ్య, వ్యవసాయ కార్మిక సంఘం దోమ మండల అధ్యక్షుడు
పీఎం కిసాన్ పథకంలో కొందరు రైతులకే అవకాశం కల్పించి మరికొందరికి అన్యాయం చేయడం సరికాదు. రైతులందరికీ లబ్ధి చేకూరేలా కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకోవాలి. మండలవ్యాప్తంగా 4020 మంది రైతులుండగా.. 2922 మందికి పీఎం కిసాన్ అందకపోవడం గమనార్హం. అందరికీ ఈ పథకం అందనట్లయితే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతుల కోసం ఉద్యమిస్తాం.
రైతు బంధు తరహాలో న్యాయం చేయాలి: లక్ష్మయ్యముదిరాజ్, రైతు బంధు సమితి దోమ మండల కోఆర్డినేటర్
పీఎం కిసాన్ పథకాన్ని తెచ్చి కొంత మంది రైతులకే లబ్ధి చేకూరేలా ఆంక్షలు పెట్టడం సరికాదు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి ప్రతి సీజన్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారికి సాయం అందిస్తున్నట్లుగానే.. కేంద్రం ఆ దిశగా కేంద్రం చర్యలు చేపట్టాలి.
రైతుల విన్నపాన్ని ఆలకించాలి: జోగు వెంకటయ్య, రైతు
నాకు పట్టాదారు పాసుపుస్తకం వచ్చిన తరువాత సీఎస్సీ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సంవత్సరం గడిచింది. అయినా నాకు పీఎం కిసాన్ పథకం డబ్బులు అందలేదు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రైతుల విన్నపాన్ని విని పీఎం కిసాన్ పథకంలో మార్పులు తీసుకువచ్చి రైతులను ఆదుకోవాలి. ఆర్థికంగా ఎదిగేలా సహకరించాలి.