మొయినాబాద్, నవంబర్ 12 : దశల వారీగా గ్రామాలను అభివృద్ధి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేపట్టిన శుభోదయం కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని కనకమామిడి, అప్పారెడ్డిగూడ, సజ్జన్పల్లి గ్రామాల్లో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సర్పంచ్‌లు పి జనార్దన్‌రెడ్డి, అంబాజీరావు, ఎంపీటీసీ ప్రభావతిలతో కలిసి గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కనకమామిడి రెవెన్యూలో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని, వాటిని కాపాడాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లయితే అట్టి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రెవెన్యూ అధికారుల తప్పిదాలతో పట్టా భూములను భూదాన్ భూములుగా రికార్డులు మార్చి గత కొన్ని ఏండ్లుగా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే ముందు రైతులు వాపోయారు. దీంతో రైతులు తమ భూమి మీద ఉన్న సర్వ హక్కులను కోల్పోతున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు. అదే విధంగా గత 20 ఏండ్ల క్రితం గ్రామస్తులకు ఇంటి స్థలాలు ఇచ్చారని.. వాటిని రెగ్యులరైజ్ చేసి పేద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించాలని గ్రామస్తులు కోరారు. అప్పారెడ్డిగూడలో గ్రామానికి ముందు ప్రమాదకరంగా పాడుబడ్డ బావి ఉందని.. దానిని పూడ్చమని పలు మార్లు గ్రామస్తులు కోరినా సర్పంచ్ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు సర్పంచ్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. పాడుబడిన బావిని వెంటనే పూడ్చివేయించాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామంలో సీసీ రోడ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే
రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలతో రైతులకు సంబంధించిన పట్టా భూములను రికార్డుల్లో భూదాన్ భూములుగా మార్చారని దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే యాదయ్య ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌కు ఫోన్ చేసి చెప్పారు. అదే విధంగా గతంలో కనకమామిడి గ్రామ రెవెన్యూలోని సర్వే నంబర్ 51లో పేద ప్రజలకు ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారని.. వాటిని మళ్లీ పునరుద్దరించి పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సీఎస్‌కు వివరించారు. ఆర్టీసీ బస్ సర్వీస్‌లు సరిగ్గా రావడం లేదని గ్రామస్తులు చెప్పడంతో వెంటనే మెహీదిపట్నం డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి బస్ సర్వీస్‌లను వెంటనే పునరుద్దరించాలని ఆదేశించారు. కనకమామిడి గ్రామంలో ఉన్న ప్రధాన మురుగు కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని, తక్షణమే రూ.20 లక్షలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కనకమామిడి గ్రామం నుంచి వెంకటాపూర్ గ్రామం వరకు ఉన్న బీటీ రోడ్డు మరమ్మతులు త్వరలోనే పూర్తి చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంధ్య, ఏవో రాగమ్మ, కనకమామిడి సర్పంచ్ జనార్దన్‌రెడ్డి, ఎంపీటీసీ ప్రభావతి, మాజీ ఉపసర్పంచ్ రాంరెడ్డి, నాయులు జయవంత్, గణేశ్‌రెడ్డి, కరన్, రవికుమార్, పరమేశ్ పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని మొయినాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించగా, సీడీఎఫ్‌డీ నిధులు రూ.5 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో కొనసాగుతున్న శంకర్పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల భవనానికి ప్రహరీ నిర్మాణం కోసం శనివారం ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువ నిర్మాణాల కోసం నియోజకవర్గం అభివృద్ధి నిధుల ద్వారా నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి విద్యకు ఏడాదికి రూ.1.30 లక్షలు ఖర్చు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు షేక్ కరీమాబీ, గునుగుర్తి స్వరూప, ఎంపీటీసీ పి. పద్మమ్మ, ఉపసర్పంచ్ రాజేశ్‌గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ బిలాల్, ఎంపీడీవో సంధ్య, ఏవో రాగమ్మ, ఏఈవో సునీల్, ఏఈ గోపాల్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జయమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ఎంఏ రావూఫ్, ప్రధానకార్యదర్శి నర్సింహాగౌడ్, నాయకులు ఆండ్రూ, షేక్ మహబూబ్, పరమేశ్, ఎండీ ముజ్జు, వెంకట్‌రెడ్డి, భిక్షపతి, ఈశ్వర్, షుకూర్, రాము, అంజయ్యగౌడ్, ఎండీ మోహిన్, పాల్గొన్నారు.