రంగారెడ్డి, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): పోడు భూ ముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలను ముమ్మ రం చేసింది. ఈ నెలాఖరు వరకు పోడు భూముల సర్వేను పూర్తి చేసి, గ్రామసభ, డివిజన్ సభ, జిల్లా సభలను పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు భూముల సర్వేను పూర్తి చేసి గ్రామసభలను నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గత ఆరు నెలలుగా పోడు భూములను సాగు చేస్తున్న రైతులు, గిరిజనులు దరఖాస్తు చేసుకుంటున్నారు. కాగా ఇప్పటివరకు కొన్ని భూముల్లో సర్వే పూర్తి కాగా.. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరగా క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి దరఖాస్తుదారుడీ భూమిని పరిశీలించి సర్వే చేస్తున్నారు. ఈ సర్వేను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేసి, సంబంధిత యాప్లో వివరాలను అప్లోడ్ చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో గ్రామ సభలను నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
241 దరఖాస్తులకు సర్వే పూర్తి
రంగారెడ్డి జిల్లాలో పోడు భూములకు సంబంధించి 1,086 దరఖాస్తులు వచ్చాయి. మూడు మండలాల్లోని ఆరు గ్రామాలకు చెందిన రైతుల నుంచి వచ్చాయి. మంచాల మండలం లోని రంగాపూర్, తాళ్లపల్లిగూడ, తిప్పాయిగూడ గ్రామాల తోపాటు అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్, తట్టిఅన్నారం, ఇబ్రహీంపట్నం మండలంలోని పొల్కంపల్లి గ్రామాల నుంచి దరఖాస్తులొచ్చాయి. రంగాపూర్ నుంచి 186 దరఖాస్తులు రాగా వాటి సర్వే పూర్తైంది. పొల్కంపల్లిలో 35 దరఖాస్తులు రాగా ఎనిమిది దరఖాస్తుల సర్వే పూ ర్తైంది. కుత్బుల్లాపూర్ నుంచి 98, తట్టిఅన్నారం నుంచి 542 దరఖాస్తులు రాగా.. ఆ భూములు మున్సిపల్, రెవెన్యూ శాఖల పరిధిలోనివి కావడంతో ఒక్క దరఖాస్తుకు కూడా అధికారులు సర్వే చేయలేదు. అలాగే మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడ నుంచి 224 దరఖాస్తులు రాగా..ఆ భూములూ రెవెన్యూ శాఖకు చెందినవి కావడంతో సర్వే కొనసాగలేదు. తిప్పాయిగూడ నుంచి ఒక దరఖాస్తు రాగా అక్కడా సర్వే చేపట్టలేదు.
రెవెన్యూ, అర్బన్ పరిధిలోని భూములకు..
పోడు భూముల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు సంబంధిత గ్రామాలకెళ్లి క్షేత్ర స్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. రెవెన్యూ, అర్బన్, మున్సిపాలిటీలకు సంబంధించిన భూములు కాకుండా ఉన్న వాటి ని పరిశీలించి అధికారులు సర్వే చేస్తున్నారు. కాగా రెవె న్యూ శాఖ పరిధిలో ఉన్న భూములకు ‘పోడు’ వర్తించదని అధికారులు తేల్చి చెబుతున్నారు. 1,086 దరఖాస్తుల్లో 241 దరఖాస్తులకు సర్వే పూర్తైనందున లబ్ధిదారులకు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు వ్యక్తు లు ఆ భూముల్లో సాగు మాత్రమే చేసుకోవాలని, విక్రయించుకునేందుకు అవకాశం ఉండదని సూచిస్తున్నారు.