యాలాల, నవంబర్ 10: అధిక ఉత్పత్తే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ప్రస్తుత వ్యవసాయానికి భిన్నంగా అడుగులు వేస్తున్నాడు ఓ ఆదర్శ రైతు. పూర్వకాలం నుంచి వస్తున్న సమీకృత సేంద్రియ పద్ధతిని అనుసరిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మండలంలోని పగిడ్యాల గ్రామానికి చెందిన ఆదర్శరైతు బ్యాగరి యాదప్ప. తనకున్న 20 ఎకరాల పొలంలో కెమికల్స్ వినియోగించకుండా మల్లి క, రసాలు వంటి మామిడి రకాలతోపాటు కొబ్బరి, అల్లనేరేడు, జామ తోటలను సేంద్రియ ఎరువులతో సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నాడు. అంతేకాకుండా రెండు పెద్ద పిష్ ఫాండ్లను ఏర్పాటు చేసి చేపలు, దాదాపు రూ.80 లక్షల విలువ గల షెడ్‌ను నిర్మించి సీమ పందులతోపాటు కడక్‌నాథ్ కోళ్లు, గొర్రెల పెంపకాన్ని చేపడుతున్నాడు. సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతితో అనేక రకాల పంటలను ఒకే సమయంలో ఒకే భూమిలో సాగు చేయ డం ద్వారా సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుందని.. పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నాడు.
పురాతన పద్ధ్దతులే అందరికీ ఆదర్శం
సమీకృత విధానం కొత్తదేమి కాదని తాతల కాలం నుంచి ఈ పద్ధ్దతి కొనసాగుతున్నదని ఆదర్శరైతు బ్యాగరి యాదప్ప పేర్కొంటున్నాడు. అయితే రానురాను అధిక దిగుబడులను సాధించాలనే ఆశతో రైతు లు ఏక పంటల సాగుకు అలవాటు పడిపోయారన్నారు. వాణిజ్య పంటలతోపాటు తన కుటుంబానికి అవసరమైన ఆహారాన్ని స్వ యంగా పండించుకోవాలన్నాడు. ఒకే భూమిలో పలు రకాల పం టలను ఏక కాలంలో సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందొచ్చని.. ఈ సమీకృత వ్యవసాయం వైపు అన్నదాతలు అడుగులు వేయాలని సూచిస్తున్నాడు.
చేతి నిండా పని..
సమీకృత విధానం ద్వారా రైతులకు ఏడాది పొడవునా చేతి నిండా పని ఉంటుంది. అంతేకాకుండా ప్రతినెలా ఆదా యం వస్తుండటంతో రైతులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవచ్చు. భూమిలోనే సహజ వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకొం టూ వ్యవసాయం, ఉద్యాన పంటలతోపాటు పాడి పశువులు, జీవాలు, కోళ్లు, చేపల పెంపకం చేపడుతూ రెండు చేతు లా సంపాదిస్తున్నారు. మేకలు, ఆవుల పేడను చేపల పెంపకంలో ఉపయోగిస్తున్నారు. ఈ విధా నం ద్వారా పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఒక దానిలో నష్టం వస్తే మరొక దానిలో వచ్చిన లాభంతో దానిని భర్తీ చేసుకోవచ్చు. రైతులు నష్టాల నుంచి సులువుగా బయటపడతారు. అలాగే వారు వ్యవసాయం కోసం ఇతరుల వద్ద అప్పు తీసుకోవాల్సిన అవసరమూ ఉండదు.
150 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ..
నా కలల సౌధం SYSA ఆగ్రో ఫార్మ్స్ అండ్ లైవ్ స్టాక్. సమీకృత సేంద్రియ పద్ధతి ద్వారా కష్టానికి తగిన ఫలితం వస్తున్నది. నేను రెండు పిష్ ఫాండ్లను ఏర్పాటు చేసి చేపల పెంపకాన్ని చేప ట్టా. గతేడాది ఐదుటన్నుల దిగుబడి రాగా ఖర్చులు పోను 40 శాతం వరకు లాభం వచ్చింది. ఈ ఏడాది 70శాతం వరకు లా భం వచ్చేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నా. దానితోపాటు సీమ పందుల పెంపకాన్ని కూడా చేపట్టా. త్వరలో రెండో యూనిట్‌ను ప్రారంభించబోతున్నా. వాటికి అవసరమైన దాణాను ఇంటి వద్దే తయారు చేస్తా. భవిష్యత్తులో అరటితోట, పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టనున్నా. నేను నా కుటుంబంతో కలిసి ముంబైకి వలసవెళ్లి 30 ఏండ్లపాటు అక్కడ జీవించా. గ్రామస్తులు ఎవ రూ వలస వెళ్లొద్దనే ఉద్దేశంతోనే నా వ్యవసాయ క్షేత్రంలో 150 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా. -బ్యాగరి యాదప్ప, పగిడ్యాల గ్రామానికి చెందిన ఆదర్శరైతు
సీమపందుల పెంపకంతో మంచి ఆదాయం
మాది ఉత్తరప్రదేశ్. సీమ పందుల పెంపకంతో మంచి లాభాలు వస్తాయి. సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతితో అనేక పంటలను ఒకే సమయం లో ఒకే భూమిలో సాగు చేయొచ్చు. దీని ద్వారా సమయం వృథా కాదు.. డబ్బు కూడా ఆదా అవుతుంది. పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫాం మన జిల్లాలో మరొకటి లేదు.
-సందీప్ దుబే, షెడ్డు నిర్వాహకుడు