కొడంగల్, నవంబర్ 10: విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టీ పద్ధతిలో కాకుండా ఆలోచించి, అర్థం చేసుకుని చదివితే వారికి గుర్తుండటంతోపాటు.. చదువాలనే ఆసక్తి కూడా పెరుగుతుందని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువులో కొం త మేర వెనుకబడి ఉంటారు.. వారికి పుస్తకాల్లోని పాఠాలను బోధించడంతోపాటు నూతన పద్ధతులను ఉపయోగించి బోధిస్తే చదువాలనే ఆసక్తి వారిలో పెరిగి రాణించే ఆస్కారం ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు క్రాంతికుమార్ నిరూపించారు.
మున్సిపల్ పరిధి పాత కొడంగల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో క్రాంతికుమార్ అనే ఉపాధ్యాయుడు 2010లో పోస్టింగ్ తీసుకునే సమయంలో అక్కడ 25 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. ప్రతిరోజూ 10 నుంచి 15మంది వరకే స్కూల్‌కు వచ్చేవారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇండ్లకెళ్లి స్కూల్‌కు పంపించాలని తల్లిదండ్రులకు సూచించేవారు. కొంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసమే పాఠశాలకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లేవారు. ఈ పరిస్థితిని మార్చాలని.. విద్యార్థులకు ఆటపాటలతో చదువు చెప్పాలని ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారు. పాఠ్యాంశాలకు సంబంధించిన పరికరాలను తయారు చేస్తూ.. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 65 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతిరోజూ దాదాపుగా అందరూ విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. విద్యార్థులు చదువులో రాణించేలా వినూత్న రీతిలో వారికి ఉపాధ్యాయిని సంధ్యతో కలిసి ప్రధానోపాధ్యాయుడు క్రాంతికుమార్ బోధిస్తున్నారు. విద్యార్థులు చదువుల్లో చురుగ్గా ఉండేందుకు కొత్త, కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు.
ఫన్ విత్ గణితం మాడ్యూల్స్‌తో..
విద్యార్థులకు గణితాన్ని సులభంగా బోధించేందుకు గత రెండు నెలలు గా నూతన మాడ్యూల్స్‌ను అనుసరించారు. ‘ఫన్ విత్ గణితం మాడ్యూల్స్’పై మొదట్లో విద్యార్థులు ఆసక్తి చూపుతారా అనే అనుమానం ఉండేదని.. ఆచరణలో పెడితే సాధించొచ్చనే ఉద్దేశంతో విద్యార్థులకు పరిచయం చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు క్రాంతికుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఈ విధమైన మాడ్యూల్స్‌ను ఎవరూ వినియోగించలేదని.. ప్రప్రథమంగా కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్ మున్సిపాలిటీ పాతకొడంగల్ ప్రాథమిక పాఠశాలలో మాత్రమే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో మాడ్యూల్ రూ.వెయ్యి వరకు లభిస్తుందని.. గణితంలో గుణింతాలు, కూడికలు, తీసివేతలు, బాగాహారం వంటి పాఠ్యంశాలకు సంబంధించి నాలుగు మాడ్యూల్స్‌ను కొనట్లు తెలిపారు. ఒక్కో మాడ్యూల్లో రెండు వేల వరకు గణితానికి సంబంధించిన అంకెలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థికీ నోట్‌బుక్‌లో కూడికలు, తీసివేతలు పెట్టించి వారితో చేయించాలంటే ఇబ్బంది అవుతుందని.. అదే స్టాంప్‌లా ఉండే ఈ నూతన మాడ్యూల్‌ను ఉపయోగిస్తే ఒక్కో విద్యార్థికీ 20 నుంచి 30 విధాలా లెక్కలను నేర్పిం చే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు ఈ విధానంలో బోధిస్తుండటంతో వారికి గణితంపై ఆసక్తితోపా టు పోటీతత్వం కూడా పెరిగిందని, సులభంగా అర్థం అవుతుండటంతో ఇచ్చిన హోంవర్క్‌ను తొందరగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానంలో బోధన బాగుందని విద్యార్థులు చెబుతున్నారన్నారు.
విద్యార్థులు పోటీ పడి ప్రతిభ చూపుతున్నారు
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరినప్పుడే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుంది. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటుకు దీటుగా నిలపాలనే సంకల్పంతో విద్యార్థులందరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధిస్తున్నాం. భట్టీ విధానంలో కాకుండా విద్యార్థులు ఆలోచించి, అర్థం చేసుకునేలా బో ధిస్తున్నాం. ‘ఫన్ విత్ గణితం మాడ్యూల్స్’తో గణిత పాఠ్యంశాల్లో విద్యార్థులు పోటీ పడి ఉత్త మ ప్రతిభను చూపుతున్నారు. జిల్లాలోనే ఈ నూతన విధానాన్ని పాతకొడంగల్ ప్రాథమిక పాఠశాలలో మాత్రమే వినియోగిస్తున్నాం. -క్రాంతికుమార్, ప్రధానోపాధ్యాయుడు పాతకొడంగల్ పాఠశాల