షాబాద్, నవంబర్ 10 : రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉన్న 20 కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. సమయానికి సిబ్బంది రావడంతోపాటు సెలవులు, ఇతర విషయాలను ఉన్నతాధికారులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పాఠశాలలకు బయోమెట్రిక్ అడెంటెన్స్ డివైజ్‌లను అందజేసింది. అందులోనే లీవ్, సిక్ లీవ్, ఓడీ, స్పెషల్ హాలీడే ఆప్షన్లు సైతం నమోదు చేసే అవకాశముంది. సిబ్బంది నిమిషం ఆలస్యమైనా రెడ్ మార్క్ పడుతుంది. వారు పాఠశాలకు హాజరైన సమయమే అందులో నమోదవుతుంది. జిల్లాలో కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది, ప్రత్యేకాధికారులు, పీజీ సీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలకు బయోమెట్రిక్ హాజరును ఈ విద్యా సంవత్సరం అక్టోబర్ రెండో వారం నుంచి అమలు చేస్తున్నారు.
జిల్లాలో 20 కేజీబీవీల్లో అమలు
రంగారెడ్డిజిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 20 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలను ఏర్పాటు చేసింది. 5వేల మంది వరకు బాలికలు చదువుకుంటున్నారు. 523 మంది వరకు బోధన, బోధనేతర, ప్రత్యేక అధికారులు, పీఈటీలు, ఏఎన్ఎంలు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారు. ఆలస్యంగా వస్తే బయోమెట్రిక్ రెడ్ మార్క్ నమోదవుతుండడంతో అంతా సకాలంలో హాజరవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ పాఠశాలలో విద్యార్థుల హాజరుతోపాటు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఉన్నతాధికారులకు ఏ రోజుకారోజు చేరవేస్తున్నారు.
బయోమెట్రిక్ ఉపయోగాలు
బయోమెట్రిక్‌తో ఉదయం ప్రార్థన సమయానికి ఎంతమంది ఉపాధ్యాయులు వస్తున్నారు.. ఆలస్యంగా ఎంతమంది వస్తున్నారో తెలుస్తంది. జిల్లా విద్యాశాఖలోని సమగ్రశిక్షలో సెక్టోరియల్ అధికారి(జీసీడీవో)లకు ఏయే పాఠశాలల్లో ఎస్వో నుంచి ఉపాధ్యాయుల వరకు ఎవరు వచ్చారో తెలుసుకునే అవకాశం సులభమవుతుంది. ఎవరు సెలవులో ఉన్నారో తెలుస్తుంది. ఉపాధ్యాయులంతా సకాలంలో హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన బయోమెట్రిక్ యంత్రాలను ఆయా పాఠశాలలకు అందజేశారు. ఉదయం పాఠశాలకు వెళ్లగానే తిరిగి సాయంత్రం పాఠశాల ముగిశాక బయోమెట్రిక్ హాజరు వేయాలి.
అన్ని పాఠశాలలో బయోమెట్రిక్ అమలు: ఉషారాణి, కేజీబీవీ పాఠశాలల రంగారెడ్డిజిల్లా అధికారి
రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా 20 కేజీబీవీల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన డివైజ్‌లను ఆయా పాఠశాలలకు అందజేశాం. గతంలో ఏ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు హాజరయ్యారనే అంశాన్ని ఫోన్ ద్వారా తెలుసుకునేది. బయోమెట్రిక్ విధానంతో విద్యాశాఖ కార్యాలయం నుంచే పర్యవేక్షించే అవకాశం కలిగింది.ప్రతి పాఠశాలలోని బోధన, బోధనేతర సిబ్బంది బయోమెట్రిక్ హాజరుతో పాటు విద్యార్థుల హాజరును నమోదు చేసి జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షకు అందజేస్తున్నారు.