సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా ఉన్న నివాసయోగ్య నగరాలపై అధ్యయనం చేసిన గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టింగ్ సంస్థ ‘మెర్సర్’ నివేదికలో వరుసగా ఐదు పర్యాయాల పాటు మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే ఈ ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో 264 నగరాల్లో సిటిజన్ పర్సెప్షన్ సర్వే (సీపీఎస్)కు శ్రీకారం చుట్టారు. ఈ నెల 9వ తేదీన సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా.. డిసెంబర్ 23 వరకు దాదాపు 45 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్నారు. నగరంలో ప్రజల జీవన ప్రమాణాలపై దేశవ్యాప్తంగా ఈజ్ ఆఫ్ లివింగ్, ‘సిటిజన్ పర్సెప్షన్- 2022’లో నగర వాసులు పాల్గొని గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని మరోసారి ముందంజలో నిలుపాలని జీహెచ్ఎంసీ పిలుపునిచ్చింది.
దేశవ్యాప్తంగా ఉన్న ఆకర్షణీయ (స్మార్ట్ సిటీ) కార్యక్రమంలో భాగంగా కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు ఈజ్ ఆఫ్ లివింగ్పై 10 లక్షలు జనాభా పైబడిన నగరాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఇంటి అద్దె, ప్రజా రవాణ, ఇతరత్రా అంశాలపై మొత్తం 17 ముఖ్య పౌర సేవల సదుపాయాల గురించి కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రశ్నలకు పౌరులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. జీవన ప్రమాణాలపై సర్వే గురువారం నుండే ప్రారంభమైనందున నగర వాసులు నగరానికి మంచి ర్యాంకు వచ్చే విధంగా సర్వేలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. సంబంధిత క్యూఆర్ ( QR )కోడ్ ద్వారా గానీ, యూఆర్ఎల్ ద్వారా గానీ సర్వేలో పాల్గొనాలి. 8 భాషల్లో సర్వే నిర్వహించబడుతున్నది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠి, గుజరాత్ భాషల్లో ప్రశ్న పత్రాలు కలవు. రాష్ట్రం, తెలంగాణ, హైదరాబాద్ నగరం పేరు తప్పని సరిగా ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
సర్వేలో ఈ అంశాలే ప్రధానం
సర్వేలోని పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. పనిదినాల్లో రోడ్లపై ప్రయాణానికి పట్టే సమయం, ప్రజా రవాణా సదుపాయం, కొత్తగా వచ్చే వలసలు, అన్ని కులాలు, మతాలు కలిసి నివసించే వైవిధ్యం, అందుబాటులో ఇండ్లు, ఆహార సదుపాయాలు, స్కూళ్లు, ఆస్పత్రులు లాంటి మౌలిక సదుపాయాలు, పచ్చదనం, పరిశుభ్రమైన గాలి, మున్సిపాలిటీ ఆర్థిక స్థోమత అంశాలు తీసుకుంటారు. అంతేకాకుండా రాజకీయ-సామాజిక వాతావరణం, రాజకీయ-సాంస్కృతిక, వైద్య ఆరోగ్య సేవల లభ్యత, విద్యావకాశాలు, పౌర సేవలు, రవాణా, వినోదం, వినియోగ వస్తువులు, గృహ నిర్మాణం, సహజ వాతావరణం తదితర అంశాల ఆధారంగా సర్వే జరుగనున్నది.