కొడంగల్/ బొంరాస్‌పేట, నవంబర్ 7: రాష్ట్రంలో కులవృత్తుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట మండలంలోని కొడంగల్, బొంరాస్‌పేట, చౌదర్పల్లి, ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టుల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుదల చేశారు. చౌదర్పల్లిలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించే ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో చిన్నాభిన్నమైన కులవృత్తుల వారిని ఆదుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్న దన్నారు. కులవృత్తుల జీవనోపాధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గొల్ల కురుమల జీవనోపాధికి ఉచితంగా గొర్రె పిల్లలను పంపిణీ చేశామని, మత్స్య సహకార సంఘాలలోని సభ్యులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలోని చెరువులలో ఈ ఏడాది 20.94 లక్షల చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు.
చేపల చెరువులను లీజుకు ఇవ్వకుండా మత్స్యకారులే చేపలను పట్టి అమ్ముకుంటే లాభం పొందుతారని అన్నారు. మత్స్యకారులకు త్వరలో వాహనాలు, యాదవులకు రెండో విడుత గొర్రెలను పంపిణీ చేస్తామని, అర్హులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని, పేదలు డబుల్‌బెడ్ రూం ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కొడంగల్ పెద్ద చెరువు కట్ట మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు. చెరువు కట్ట నుంచి పాత కొడంగల్ తండా రోడ్డు వరకు బీటీ రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా మత్స్యశాఖ ఏడీ చరితారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులకు రాయితీపై వలలు, మోపెడ్లు అందజేస్తున్నామని, చెరువుల పక్కనే భూమి ఉంటే పట్టిన చేపలను శుభ్రం చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి వందశాతం మార్కెటింగ్ కేంద్రాలను కూడా మంజూరు చేస్తున్నామన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వమే ప్రీమి యం చెల్లించి రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తుందని ఈ పథకంలో ప్రతి ఒక్కరు చేరి లబ్ధిపొందాలని ఆమె కోరారు.
ఏర్పుమళ్లకు ఎమ్మెల్యే వరాలు
మండలంలోని ఏర్పుమళ్ల గ్రామంపై ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.40 లక్షలు, కాకరవాణి ప్రాజెక్టు వరకు రోడ్డు అభివృద్ధి కొరకు రూ.10 లక్షలు, గ్రామ పంచాయతీకి కొత్త భవనం మంజూరు చేస్తామని, కాకరవాణి ప్రాజెక్టు పక్కనే చేపల మార్కెటింగ్ కేంద్రానికి ఒక ఎకరం ప్రభుత్వ భూమి ఇప్పిస్తానని, చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రామ మత్స్య సహకార సంఘం ఏర్పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూరి చేయిస్తానని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. నాందార్పూలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన వార్డు సభ్యురాలు వెంకటమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి,మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్‌రావు యాదవ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ, ఎంపీటీసీ శంకర్‌నాయక్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు సిద్దిలింగప్ప, బాలక్రాజ్, ఎంట్ల మల్లయ్య, బొంరాస్‌పేట ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కృష్ణ, రైతుబంధు సమితి మండలఅధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, తాలుకా అధికార ప్రతినిధి టీటీ రాములు, తాలుకా, మండల యూత్ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, మహేందర్, ఎంపీటీసీలు శ్రావణ్‌గౌడ్, వెంకటమ్మ, తిరుపతయ్య, సర్పంచ్‌లు పార్వతమ్మ, వెంకటమ్మ, పార్టీ నాయకులు బాబర్, రామకృష్ణ, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.