బొంరాస్‌పేట, నవంబర్ 4 : విద్యార్థుల్లో ఆలోచనలకు పదును పెట్టి వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి, సరికొత్త ఆవిష్కరణలను రూపొందించే చక్కని అవకాశాలకు నవంబర్ నెల ప్రధానంగా మారింది. సమాజంలోని పలు రకాల సమస్యలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం చూపే రకరకాల ప్రాజెక్టుల ప్రదర్శనకు విద్యార్థులకు మంచి అవకాశం లభించింది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మాథ్స్, ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్, బాలల సైన్స్ కాంగ్రెస్ తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ల పేరుతో మూడు వేర్వేరు సైన్స్ ప్రదర్శనలను ఈ నెలలో నిర్వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రదర్శనలను సిద్ధం చేసేలా సంబంధిత అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. కరోనా కారణంగా రెండేండ్లుగా ఆన్లైన్లోనే జిల్లా, రాష్ట్రస్థాయి ప్రదర్శనల పోటీలు నిర్వహించారు. ఈ ఏడాది కొవిడ్ తగ్గడంతో వీటిని ఓ వేదికగా ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండేండ్ల తరువాత మళ్లీ సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రారంభం కానుండడంతో విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలను తయారు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.
జవహర్లాల్ నెహ్రూ సైన్స్, మాథ్స్, ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్‌ను జిల్లా విద్యాశాఖ ఈ నెల చివరి వారంలో జిల్లా స్థాయిలో నిర్వహించనున్నారు. ఈ సమాచారాన్ని అన్ని పాఠశాలలకు అందించారు. రాష్ట్రస్థాయిలో వచ్చే నెలలో నిర్వహిస్తారు. ఇందులో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని 6-12వ తరగతి విద్యార్థులు నూతన ప్రాజెక్టులు రూపొందించి పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 5వ తేదీ తరువాత ప్రారంభం కానున్నది. టెక్నాలజీ అండ్ టాయ్స్ ప్రధాన అంశంగా ఈ ఏడాది సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. పర్యావరణ అనుకూల పదార్థాలు, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్, ఆరోగ్యం-పరిశుభ్రత తదితర ఆరు ఉప అంశాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు.
స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరుతో కార్యక్రమాన్ని మూడేండ్ల నుంచి నిర్వహిస్తున్నది. ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు ఇందులో పాల్గొనేందుకు తమ వివరాలను ఈ నెల 5వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఏ సబ్జెక్టు టీచరైనా ఇందులో వివరాలను నమోదు చేసుకోవచ్చు. సదరు టీచర్ వారి వారి పాఠశాలల్లో 5 నుంచి ఏడుగురు విద్యార్థులతో బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా ఒక పాఠశాలలో రెండు నుంచి నాలుగు బృందాల వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. పేర్లు నమోదు చేసుకున్న ఉపాధ్యాయులకు ఇన్నోవేషన్ ఛాలెంజ్ వారు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ అనంతరం విద్యార్థుల బృందాలు ఉపాధ్యాయుడు వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలి. ఇన్నోవేషన్ ఛాలెంజ్ వారు ఈ గ్రూపులకు పంపించే వీడియోలు, ఆడియోలను పరిశీలించి వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన ఐడియాలను రూపొందించాలి. ఉత్తమ ఐడియాలను ఎంపిక చేసి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు.
జాతీయ బాలల కాంగ్రెస్..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లాస్థాయి ప్రదర్శనను ఈ నెలాఖరులో జిల్లా విద్యాశాఖ నిర్వహించనున్నది. ‘ఆరోగ్యం, సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం’ అనే అంశంపై ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించి ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఇద్దరు సభ్యులతో కూడిన విద్యార్థుల బృందం గైడ్ పర్యవేక్షణలో ప్రాజెక్టు నివేదికను తయారు చేయాలి.
ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతులపై ప్రాజెక్టు నివేదికను సమగ్రంగా రూపొందించాలి.
జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలో విద్యార్థుల బృందాలు ప్రాజెక్టు నివేదికలతో హాజరై వాటి గురించి వివరంగా వివరించాలి.
విద్యార్థులకు ఉత్తమ అవకాశం..
ఎన్సీఈఆర్టీ, విశ్వేశరయ్య టెక్నాలజీ వారు సైన్స్, మాథ్స్, ఎన్విన్మెంట్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనలకు ఎంపికైన వారి ప్రాజెక్టులను ఎన్సీఈఆర్టీ శాస్త్రవేత్తల సహకారంతో అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో నిర్వహించే ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. జాతీయస్థాయిలో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, సత్కారాన్ని పొందుతారు.
ప్రతిభ చాటడానికి మంచి అవకాశం..
ఈ నెలలో నిర్వహించే రెండు సైన్స్ ఎగ్జిబిషన్లు, ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమాలు విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభా నైపుణ్యాలను చాటడానికి చక్కటి అవకాశం. ఎంపిక చేసిన అంశాల్లో ఎగ్జిబిషన్లు రూపొందించి ప్రదర్శనకు విద్యార్థులు సిద్ధం కావాలి. ఉపాధ్యాయులు ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలి.
-విశ్వేశ్వర్,జిల్లా సైన్స్ అధికారి