పరిగి, నవంబర్ 2 : గ్రామీణ యువత ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి చైర్మన్ ఎం.డి.యూసుఫ్ జాహిద్ సూచించారు. పీఎంఈజీపీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. బుధవారం డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి ఆదేశాల మేరకు పరిగిలోని ది హైదరాబాద్ జిల్లా సహకార బ్యాంకులో పీఎంఈజీపీపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాహిద్ మాట్లాడుతూ.. పీఎంఈజీపీ ద్వారా యువత ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరుచుకొని ఆర్థిక ప్రగతి సాధించాలన్నారు. ఈ పథకం కింద వివిధ రకాల యూనిట్ల ఏర్పాటుకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. తమ కాళ్లపై తాము నిలబడేందుకు వీలుగా ఈ ఉపాధి రంగాలను యువత ఎంచుకోవాలని ఆయన సూచించారు.
ఖాదీ బోర్డు ప్రాంతీయ అధికారి గుగుల్ల సైదా మాట్లాడుతూ.. ఈ పథకం కింద సేవా రంగానికి గరిష్ట ప్రాజెక్టు విలువ పరిమితి రూ.20లక్షలు, తయారీ రంగానికి రూ.50లక్షలు ఇవ్వనున్నామని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మహిళలు, బలహీన వర్గాలకు చెందినవారు 5శాతం తమ పెట్టుబడిగా, జనరల్ కేటగిరివారు 10శాతం పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు 35శాతం సబ్సిడీ, పట్టణ ప్రాంతం వారికి 25శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
జనరల్ కేటగిరిలో గ్రామీణ ప్రాంతం వారికి 25శాతం, పట్టణ ప్రాంతం వారికి 15శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు చెప్పారు. రుణం కాలపరిమితి 4 నుంచి 5 ఏండ్లు అని తెలిపారు. రూ.5లక్షలు మించిన సేవా రంగ పరిశ్రమకు కనీస విద్యార్హత 8వ తరగతి, రూ.10లక్షలు మించిన ఉత్పత్తి రంగాలకు కనీస విద్యార్హత 8వ తరగతి ఆపైన చదువుకొని ఉండాలన్నారు. ఈ పథకం కింద కుటుంబంలో ఒకరికే ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈవో శ్రీనివాస్, ఎల్డీఎం రాంబాబు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వినయ్‌కుమార్, పరిగి, దోమ పీఏసీఎస్‌ల చైర్మన్లు శ్యాంసుందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.