ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు మహర్దశ వచ్చింది. మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో మున్సిపాలిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరువతో మిషన్‌భగీరథ నిధుల నుంచి తక్షణమే రోడ్లు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో రోడ్ల మరమ్మతులు చకచక సాగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే పలు ప్రధాన రహదారులు, పైపులైన్ల కోసం తీసిన గోతుల వల్ల ప్రజలు నిత్యం నిత్యం నరకాన్ని చూసిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్రహీంపట్నంలోని పాతబస్టాండ్ నుంచి వెంకటరమణ నగర్‌కాలనీ, సాగర్‌రోడ్డు నుంచి కేవితండాకు వెళ్లే రోడ్డు, ఎంబీఆర్నగర్లోని ప్రధాన రహదారి, తహసీల్దార్ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు గల రహదారి, మహంకాళి దేవాలయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు, ప్రభుత్వ దవాఖాన నుంచి మున్నూరు కాపు సంఘం భవనం వరకు గల ప్రధాన రోడ్లు మిషన్ భగీరథ పనుల వల్ల ధ్వంసమయ్యాయి.
వీటన్నింటిని పూర్తి చేయటం కోసం సుమారు రూ.6 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు. దీంతో మిషన్‌భగీరథ నిధుల నుంచి రోడ్ల మరమ్మతుల కోసం నిధులు తీసుకుని మరమ్మతులు చేయపట్టాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు పాతబస్టాండ్ నుంచి పాత పోలీస్ స్టేషన్ వరకు, ఆంధ్రాబ్యాంకు నుంచి బ్రిలియంట్స్కూల్ వరకు, బ్రిలియంట్ స్కూల్ నుంచి అంకిత ఆస్పత్రి వరకు, సాగర్ రహదారి నుంచి ఎంబీఆర్నగర్ మీదుగా తిరుమలహీల్స్ వరకు గల ప్రధాన రోడ్లను ఇప్పటికే సీసీరోడ్లుగా మార్చారు. త్వరలోనే మిగిలిన ధ్వంసమైన రోడ్లను కూడా త్వరలోనే మరమ్మతులు చేస్తామని మిషన్‌భగీరథ అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నిధులతో గతంలో వేసిన సీసీరోడ్లు కూడా మిషన్ భగీరథ తవ్వకాల వల్ల పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని కూడా మిషన్ భగీరథ నిధుల నుంచే మరమ్మతులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. చిన్నచిన్న కాలనీలకు వేసినరోడ్లు కూడా పైపులైన్ తవ్వకాల వల్ల ధ్వంసం కావటంతో ఆ రోడ్లలో కూడా ప్యాచ్‌వర్క్ పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇబ్రపట్నంతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ, ఖానాపూర్, సీతారాంపేట్ గ్రామాల్లో కూడా మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వాటిని తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను పూర్తిగా మరమ్మతులు చేయటం కోసం రూ.6 కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిధులతో ఇబ్రహీంపట్నంతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు పూర్తి కానున్నాయి.