సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): శునకం.. విశ్వాసానికి ప్రతిరూపం.. ఆహ్లాదాన్ని పంచే నేస్తం.. రక్షణగా నిలిచే ఆయుధం. అందుకే వీటిని ఇంట్లో పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. లక్షలు ఖర్చు చేసి వారికి నచ్చిన డాగ్‌ని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఫారిన్ జాతికి నగరంలో భలే క్రేజ్ ఉంది. ఇప్పటికే గ్రేటర్లో సుమారు 4 లక్షల పెట్ డాగ్స్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొంతమంది వీటిని చివరి వరకు సాకుతుంటే.. మరికొందరూ మధ్యలోనే వదిలేస్తున్నారు. వాటి ఆలన పాలన పై సరిగా అవగాహన లేక చాలా మంది డాగ్స్ మరణాలకు కారణమవుతున్నారు. డాగ్స్ పెంపకంపై సరైన అవగాహన లేకుండా కొనుగోలు చేయడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. నెలల వయసు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంట్లో పెరిగేవా? బయటి వాతావరణంలో పెరిగేవా? ఎలాంటి ఆహారం ఇవ్వాలి? వైద్య పరమైన జాగ్రత్తలు ఏంటీ? మనం కొనుగోలు చేసినవి నిజమైన బ్రీడేనా? దేశంలో ఏ బ్రీడ్ శునకాలను నిషేధించారు? కారణాలేంటీ? తదితర వాటన్నింటిపై పెట్ లవర్స్‌కు స్పష్టమైన సమాచారం ఉండాలని వారు సూచిస్తున్నారు. మొత్తంగా పెట్‌ను పెంచుకోవడమంటే మన కుటుంబంలోకి ఓ వ్యక్తిని ఆహ్వానించినట్టే.. మరి ఆ అతిథిని ఎంత బాగా చూసుకోవాలి. ఎలా నడుచుకోవాలో సూచిస్తూ నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం…
ఆహారం జర భద్రం..!!
పెంపుడు జంతువులను ప్రేమించే నగరవాసులు వాటికి అందించాల్సిన ఆహారం విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉంటున్నారు. వయసు, బరువు, జాతిని పరిగణనలోకి తీసుకొని ఆహారం ఇవ్వాలి. పది కిలోల కన్నా తక్కువ బరువు ఉండే పగ్స్, పమేరియన్, 30 కిలోల వరకు పెరిగే జపాన్ షెఫర్డ్, అంతకన్నా ఎక్కువగా ఉండే జైంట్ వంటి జాతులకు నిపుణుల సూచనల మేరకు ఆహారం అందించాలి. వాటి ఎదుగుదల, శరీర బరువును బట్టి పరిమాణం మారుతుంటుంది.
కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కుక్కలు బాగా తింటాయి. దానితో రక్తనాలాలపై కొవ్వు పేరుకుపోయి పొట్ట, ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. ఫలితంగా శరీర పరిమాణం పెరిగి ఊబకాయానికి గురవుతుంటాయి. దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధులతో అకాల మరణం చెందుతాయి.
ప్యాకేజ్డ్ పదార్థాలపై అధికంగా ఆధారపడుతున్నారు. నాణ్యతలేని ఆహారం పెంపుడు జంతువుల పాలిట శాపంగా మారుతుంది. గుండె జబ్బులతో మరణిస్తున్నాయి. గుర్తింపు లేని సంస్థలు లాభపేక్షతో తయారు చేసిన ఫుడ్‌ను వాటికి అందిస్తే వాటి ఆరోగ్యం క్షీణించి అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం(ఆర్ అండ్ డీ) అనుమతి లేని సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెడిగ్రీని ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తయారీలో ఉపయోగించిన వస్తువులను ఏమేరకు కలపాలి? ఏ జంతువులకు ఎలా ఉపయోగించాలనే సూచనలు కవర్‌పై ముద్రితమైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి.
గోల్డెన్ రిట్రీవర్
ఇది స్కాటిష్ జాతి శునకం. కుటుంబ సభ్యులను సంతోష పెట్టడానికి అధిక ఆసక్తిని కలిగి ఉంటుంది. వీటికి శిక్షణనివ్వడం సులభం. బయట ఆడుకోవడానికి ఆసక్తి చూపిస్తాయి. యజమానితో ఎక్కువ అనుబంధం పెంచుకుంటుంది. దీనితో ప్రమాదం చాలా తక్కువ. ఇది అనేక పాశ్చాత్య దేశాల్లో పెంపుడు కుక్కగా ప్రాచుర్యం పొందింది. చాలా మంది దీనిని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీని ధర రూ.35వేలు. మెయింటెనెన్స్ నెలకు సుమారు 15 వేలు. నాన్ వెజ్ కూడా తింటుంది.
చౌ చౌ..
ఇది చాలా ఖరీదైన శునకం. చైనాకు చెందినది. దీని ధర రూ.80 వేలు. అచ్చం సింహాన్ని పోలిన రూపంలో కనిపిస్తుంది. ఒత్తు జుట్టుతో గెంతులేస్తుంది. నెలకు మెయింటెనెన్స్ రూ. 20 వేల పైమాటే. ఇది వైట్, బ్రౌన్, బ్లాక్ కలర్స్‌తో మిళితమై ఉంటుంది. 56 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. జీవితకాలం 11 నుంచి 13 ఏండ్లు.
జర్మన్ షెఫర్డ్
చాలా మంది ఈ శునకాన్ని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. దీని ధర రూ.60వేలు. నెలకు రూ.10వేల మెయింటెనెన్స్. పరుగెత్తడంలో దిట్ట. గంటకు సుమారు 50 కిలోమీటర్లు పరిగెత్తగలదు. దీని జీవితకాలం 9 నుంచి 13 ఏండ్లు. బ్లాక్, సిల్వర్, గ్రే, రెడ్ అండ్ బ్లాక్ తదితర రంగుల్లో ఇవి ఉంటాయి.
లాస ఆప్సో..
ఈ డాగ్ బ్రీడ్ టిబెట్‌కు చెందినది. దీని ఎత్తు 28 సెంటీమీటర్లు, 8 కేజీల బరువు ఉంటుంది. దీని జీవితకాలం 12 నుంచి 14 ఏండ్లు.ఉల్లాసభరితంగా, ధృడంగా, అంకితభావంతో మెలుగుతుంది. తెలివైన శునకం, శక్తివంతమైనది. అప్రమత్తంగా ఉంటుంది. విధేయత ప్రదర్శించడంలో దిట్ట. అందుకే ఈ జాతి కుక్కను నగరంలో విరివిగా పెంచుకుంటారు. ఇవి బ్లాక్, గోల్డెన్, వైట్, బ్రౌన్ రంగులో అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ.20వేలు.
లాబ్రడార్ రిట్రీవర్
ఇది బ్రిటీష్ జాతికి చెందినది. దీని జీవితకాలం 10 నుంచి 12 ఏండ్లు. 60 సెంటీమీటర్ల ఎత్తు , 30 కేజీల బరువు ఉంటాయి. దీనిని యూకేలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ కాలనీ నుంచి ఫిషింగ్ డాగ్‌ల నుంచి అభివృద్ధి చేశారు. ఆ కాలనీ పేరు లాబ్రడార్నే దీనికి నామకరణం చేశారు. ఇది చాలా దేశాల పెంపుడు కుక్కల జాబితాలో అత్యంత ప్రధానమైనది.
షిట్జూ..
టిబెట్‌కు చెందిన జాతి ఇది. దీనిని అత్యంత విధేయత కలిగిన జాతిగా పరిగణిస్తారు. జీవితకాలం 10 నుంచి 16 ఏండ్లు. దీని ఎత్తు 28 సెంటీమీటర్ల వరకు ఉంటుం ది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ కుక్క పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలదు. కుటుంబానికి ప్రమాదకరంగా ఉండదు. ఇది ఉత్తమమైన జాతిగా పేరుగాంచింది. దీని ధర రూ. 30వేలు. వయస్సు రెండున్నరేండ్లు. దీని మెయింటెనెన్స్ నెలకు రూ.15వేలు ఉంటుంది.
బాక్సర్!
ఇది చాలా ఎనర్జిటిక్ డాగ్. ఆత్మవిశ్వాసంతో ఉంటాయి. ధైర్యాన్ని ప్రదర్శిస్తాయి. దీని ధర రూ.30వేలు. దీని జీవితకాలం 10 నుంచి 12 ఏండ్లు. 63 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. జర్మనీకి చెందిన డాగ్ ఇది. నెలకు సుమారు రూ.15 వేల వరకు మెయింటెనెన్స్ ఉంటుంది.
బీగల్..
ఇది చూడటానికి నక్కలా ఉంటుంది. కుందేళ్లను వేటాడేందుకు బీగల్ను అభివృద్ధి చేశారు. దీని జీవితకాలం 12 నుంచి 15 ఏండ్లు. దీని ధర రూ.22వేలు. యూకేకు చెందిన బ్రీడ్ ఇది. బీగల్ తెలివైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్ లవర్స్ దీని చాలా ఇష్టపడతారు. దీని ఎత్తు 38 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ట్రైకలర్, వైట్ అండ్ చాక్లెట్, ఆరెంజ్ అండ్ వైట్, రెండ్ అండ్ వైట్ రంగు ల్లో ఉంటుంది.
గ్రేట్ డేన్..
ఇది చాలా పొడవాటి శునకం. చూడటానికి భయానకంగా ఉంటుంది. యజమాని మాత్రమే దీనిని నిలువరించగలరు. అంత త్వరగా ఇతరులకు దగ్గరవదు. దీని జీవితకాలం 8 నుంచి 10 ఏండ్లు. దీని ఎత్తు 76 నుంచి 90 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. బ్లాక్, మెటల్, బ్లూ తదితర మిక్స్డ్ రంగుల్లో ఉంటుంది. తోక పొడవుగా ఉంటుంది.
నిబంధనలు తెలుసుకోండి..
జంతువుల పెంపకం, రక్షణ కోసం 1968లోనే చట్టం వచ్చింది. దాని ప్రకారం జంతు సంక్షేమ బోర్డు, స్థానిక సంస్థల నుంచి బ్రీడర్లు లైసెన్స్ తీసుకోవాలి. కెనెల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో బ్రీడర్లు సభ్యత్వం పొందాలి.
గుర్తింపు పొందిన పెట్ స్టోర్లతో పాటు కొన్ని ప్రత్యేక పెట్ సంస్థలు వాటిని అందిస్తున్నాయి. కొనేముందు ఆ జంతువు పెంపకం, అది పెరిగే వాతావరణం, తీసుకునే ఆహారం, అయ్యే ఖర్చు పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు.
కుక్కల పెంపకంలో వాతావరణం కీలకం. కొన్ని పెద్ద జాతి కుక్కల పెంపకానికి విశాలమైన వాతావరణం కావాలి. వాటి పెంపకానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. కొన్నింటిని అపార్ట్మెంట్లో పెంచితే వాటి జాతి స్వభావాన్ని మార్చేసుకుంటాయి. ఇంట్లో పెరిగేవి, బయట పెరిగేవి ఇలా వివరాలు తెలుసుకున్న తరువాత కొనుగోలు చేయాలి.
శునకాల పెంపకంలో కొందరు వ్యాపార ధోరణి కనబరుస్తున్నారు. పుట్టిన తర్వాత 9 నుంచి 12 నెలలు తల్లి దగ్గరే ఉండాలి. ముందుగానే మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఇది చాలా ప్రమాదం.
ప్రత్యేకంగా డాగ్ పార్క్..
ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, షాపింగ్ దుకాణాలు ఉండటంతో.. పెంపుడు జంతువులు రిలాక్స్ అయ్యేందుకు సరైన స్థలం లేక ఇబ్బంది పడుతున్న వారికి జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసిన కొండాపూర్‌లోని 1.3 ఎకరాల స్థలంలో డాగ్ పార్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో తమ శునకాలను యజమానులు తీసుకువస్తున్నారు. నాలుగు గోడలకే పరిమితమైన ఆ శునకాలు విశాలమైన పార్కులో అడుగుపెట్టగానే ఎక్కడలేని ఉత్సాహంతో పరుగులు తీస్తున్నాయి. బల్లలు, రింగుల మీద నుంచి దూకుతూ పార్కు మొత్తం కలియ తిరుగుతున్నాయి. పార్కులో అక్కడక్కడా శునకాల బొమ్మలు, పెయింటింగ్‌లు ఉన్నాయి. మొత్తంగా ఈ పార్క్ పెంపుడు కుక్కలకు ఒక పర్యాటక ప్రాంతంగా మారింది.
ఈ ఫారిన్ బ్రీడ్స్తో పారాహుషార్..
భారతదేశంలో 11 జాతి శునకాలను నిషేధించారు. 1. అమెరికన్ బుల్డాగ్, 2. బాన్డాగ్, 3.నియోపొలిటన్ మస్టిఫ్, 4.వోల్ఫ్డాగ్, 5.బొయెర్బోయెల్, 6, ప్రెస కెనారియో, 7. ఫిలా బ్రసిలిరో, 8.టోస ఇను, 9.పిట్‌బుల్, 10.కెన్కోర్సో, 11.డాగో అర్జెంటినో జాతి కుక్కలను పూర్తిగా నిషేధించారు.
కారణాలు ఇవే..: ఈ ఫారిన్ జాతి శునకాలు అత్యంత ప్రమాదకరమైనవిగా అధ్యయనాలు తేల్చాయి. వీటికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాయో చెప్పడం కష్టం. ఇవి 80 శాతం కరవడానికి ప్రయత్నిస్తాయి. యజమాని చెప్పే మాటలకు తొలుత విన్నట్టుగానే ప్రవర్తించి అనంతరం ఆ సిగ్నల్స్‌కు వ్యతిరేకంగా నడుచుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఫారిన్ జాతికి జై..!!
డాబర్ మాన్, బీగల్, లాబ్రోడర్ రిట్రైవర్, జర్మన్ షెఫర్డ్, గ్రేట్ డేన్, బాక్సర్, మస్టిఫ్, హస్కీ, షిట్జూ, పాస్టోరల్ అండ్ షీప్ డాగ్స్, ఆస్ట్రేలియన్ కాటిల్ డాగ్, రాట్వీయలర్, డచ్షండ్, గోల్డెన్ రిట్రీవర్, చౌచౌ, తదితర ఫారిన్ జాతులు నగరంలో అధికంగా ఉన్నాయి. కాగా ఇండియన్ జాతికి చెందిన చిప్పిపరై, ముదోల్ హౌండ్, రాజపాలయం, రాంపూర్ హౌండ్, కారవన్ హౌండ్, కొంబై తదితర జాతులు అంతంత మాత్రమే కనిపిస్తాయి. చాలా మంది ఫారిన్ బ్రీడ్స్ పై మక్కువ చూపిస్తారు. ఇవి చూడటానికి అందంగా ఉండటం, జుట్టు, లావు, విభిన్న రంగుల్లో ఉండటంతో వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నెలల వయసు ఉండగానే వీటిని కొనుగోలు చేసి వారి పెంపకంలో తలమునకలవుతున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలీ, మణికొండ తదితర ప్రాంతాల్లో ఈ శునకాలు విరివిగా దర్శనమిస్తాయి. యజమానులు వాటిని తీసుకొని డాగ్ పార్కులు, పెట్ సెంటర్లకు వస్తున్న దృశ్యాలు అనేకం.
ఫారిన్ బ్రీడ్‌లతో జరభద్రం
క్రూరంగా ప్రవర్తించే శునకాలను మన దేశంలో నిషేధించారు. వాటికి శిక్షణ ఇచ్చినా అవి కొన్ని సందర్భాల్లో ఆవేశానికి గురవుతుంటాయి. వాటిని నియంత్రించడం కష్టం. అనుమతి ఉన్న ఫారిన్ జాతి శునకాలు మాత్రమే కొనుగోలు చేయాలి. ఇక ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. రోజూ ఒకే ఆహారం ఇవ్వొద్దు. ఆహారంలో మూడు లేదా నాలుగు ఆహార పదార్థాలు ఉండాలి. అధికంగా దంతాలు పాడవడం, నోటి సంబంధిత వ్యాధులే అధికంగా వస్తున్నాయి. కుక్కల జుట్టు అధికంగా రాలిపోతుంటే అప్రమత్తం అవ్వాలి. కీళ్ల సమస్యలు పెరగడంతో వాటిని అదుపు చేసేందుకు శరీరంలో ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ విడుదలవుతాయి. ఈ ప్రభావం గుండె, కండరాలు, కిడ్నీలపై పడుతోంది. ఫలితంగా పెట్స్ చిన్న వయసులోనే చనిపోతున్నాయి. యేటా 70 నుంచి 80 శాతం శునకాలు గుండె సంబంధిత వ్యాధులతోనే మృత్యువాత పడుతున్నాయి. -డాక్టర్ మరళీధర్, ఎండీ, డాక్టర్ డాగ్ పెట్ ఆసుపత్రి
ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం
చౌచౌను 80వేలు పెట్టి కొన్నాను. ముద్దుపేరు చెర్రీ. లయన్ లుక్ ఉంటుంది. నా దగ్గర గోల్డెన్ రిట్రైవర్ కూడా ఉంది. దానికి మ్యాంగో అని పేరు పెట్టా. నెలకు 60వేలకు పైగా మెయింటెనెన్స్ ఉంటుంది. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. వైద్యుల సూచనలు పాటిస్తాం. వాతావరణానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటాను. డాగ్ పార్క్‌కు నెలకు మూడు సార్లు తీసుకొస్తా. వాటికి ఇక్కడ మంచి వాతావరణం దొరుకుతుంది. సంతోషంగా ఆడుకుంటాయి. ఇలాంటి పార్క్‌ను కేటాయించిన జీహెచ్ఎంసీకి ధన్యవాదాలు.
-చైతన్య, పెట్ లవర్
అవగాహన తప్పనిసరి
నాకు డాగ్స్ అంటే ప్రాణం. మా డాగ్ ఇంగ్లిష్ రిట్రైవర్. మేం ప్రతీ వారం డాగ్ పార్క్‌కు వస్తుంటాం. ఇక్కడ సదుపాయాలు చాలా బాగున్నాయి. పెంపుడు కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రీడ్స్ విషయంలో గుర్తింపు ఉన్న సంస్థ నుంచే డాగ్‌ను కొనుగోలు చేయాలి. తొలుత మనం అనుకున్న జాతిలా కనిపించినా పెరిగే క్రమంలో మరో జాతి అని అర్థమవుతుంది. మోసపోయే అవకాశాలు అధికం. నిపుణుల సూచనలు తీసుకోవాలి. -భార్గవి, పెట్ లవర్
నా ఫ్రెండ్ కంటే ఎక్కువ..
నేను 2 నెలలు ఉన్న గోల్డెన్ రిట్రైవర్ను రూ.35వేలకు కొనుగోలు చేశా. నాకు శునకాలు అంటే చాలా ఇష్టం. ప్రతీ వీకెండ్‌కు డాగ్ పార్క్‌కు తీసుకొస్తాను. ఇక్కడ చాలా సంతోషంగా ఆడుకుంటుంది. నాన్‌వెజ్ తింటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా పెట్ ఆసుపత్రికి తీసుకెళ్తాం. అన్నీ వ్యాక్సిన్స్ వేయిస్తుంటాం. మరొక ఫారిన్ జాతి శునకాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నా. అయితే కొన్ని జాతులకు మన దేశంలో అనుమతి లేదు. మన వాతావరణానికి అనుగుణంగా ఉన్న డాగ్‌ను కొనుగోలు చేస్తాను. మా డాగ్ మెయింటెనెన్స్ నెలకు రూ.15వేల వరకు వస్తుంది. -భాను, పెట్ లవర్, కేపీహెచ్‌బీ
సైబీరియన్ డాగ్..
ఇది చాలా ఖరీదైన శునకం. దీని ధర రూ.1.20లక్షల వరకు ఉంటుంది. జీవిత కాలం 12 నుంచి 15 ఏండ్లు. ఎత్తు 60 సెంటీమీటర్లు ఉంటుంది. స్నేహపూర్వకంగా, తెలివిగా ఉంటుంది. నెలకు సుమారు రూ.21 వేలు వరకు మెయింటెనెన్స్ వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని హస్కీ, సైబ్గా నిక్‌నేమ్స్‌తో పిలుస్తుంటారు. బ్లాక్, వైట్, గ్రే, సిల్వర్, రెడ్ అండ్ వైట్ రంగుల్లో ఉంటాయి.