ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 28 : ఆవులు, గేదెల్లో దోమలు, ఈగల కారణంగా వ్యాపిస్తున్న లంపీస్కిన్ వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 58 బృందాలతో పాటు సిబ్బంది, గోపాల మిత్రులు ఊరూరా తిరుగుతూ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 78 పశువులకు వ్యాధి లక్షణాలు కనిపించగా, చికిత్సలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 3.28 లక్షల ఆవులు, గేదెలు ఉండగా, ఇప్పటి వరకు 1.28 లక్షల పశువులకు టీకాలు వేసినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలపై వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదిస్తే తక్షణమే చికిత్సలు నిర్వహిస్తున్నారు.
లంపీస్కిన్ సోకిన పశువులకు ఒకటి నుంచి ఐదు వారాల మధ్యలో వ్యాధి కనిపిస్తుంది. తీవ్రమైన జ్వరంతో పాటు కాళ్లు, పొట్ట భాగంలో నీరు చేరుతుంది. కీళ్లవాపుతో సరిగ్గా నిలబడలేవు, చర్మంపై ముద్దలుగా దద్దుర్లు వస్తాయి. మరణాల శాతం తక్కువగా ఉంటుంది. గేదెలకు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గే ప్రమాదమున్నది.
లంపీస్కిన్ వ్యాధి పశువుల్లో ఒకదాని నుంచి మరోదానికి వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడ్డ పశువును కుట్టిన దోమలు, ఈగలు, గోమార్లు వేరే పశువును ఆశ్రయిస్తే వ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నది. ఈ వ్యాధి సోకిన పశువును వేరుగా కట్టేయాలి. పశువుల పాకను శుభ్రంగా ఉంచుకోవాలి.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆవు, గేదెకు తప్పనిసరిగా లంపీస్కిన్ నివారణ టీకా వేయించాలి. జిల్లాలోని 3.28 లక్షల ఆవులు, గేదెల్లో ఇప్పటికే 1.28 లక్షల ఆవులు, గేదెలకు టీకా వేయించాం. మిగిలిన పశువులకు ఈనెలాఖరులోగా పూర్తి చేస్తాం. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలి.
– అంజిలప్ప,
జిల్లా పశువైద్యాధికారి