యాచారం, మార్చి 18 : ఇటు ఆధ్యాత్మికం.. అటు ఆహ్లాదం పచ్చని సోయగాల వాతావరణం ఉంటే ఎవరైనాసరే రెక్కలు కట్టుకొని అక్కడ వాలుతారు. ఓవైపు చల్లటి పిల్లగాలులు, మరోవైపు సెలయేటి నీటి గలగలలు. ఇంకోవైపు భక్తితత్వం. ఇలాంటి ప్రకృతి అందాల మధ్య ఆనందంగా గడిపేందుకు వంట సామగ్రితో సహా అక్కడికి చేరుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మికంతో పాటు ఆహ్లాదాన్ని పంచే దేవాలయమే యాచారం మండలం తాడిపర్తి గ్రామ పరిధిలోని తాటికుంట మైసమ్మ ఆలయం.
మహిమగల్ల దేవతగా, భక్తుల కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా తాటికుంట మైసమ్మ విరాజిల్లుతున్నది. ఈ ఆలయం చుట్టుపక్కలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఆది, గురు వారాల్లో ఆటవిడుపునకు ఎంతో ప్రసిద్ధి చెందినది. ముఖ్యంగా ఆదివారం ఆలయ పరిసరాలు పిల్లలు, పెద్దలతో కిటకిటలాడుతున్నది.
ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్
చుట్టూ ఎత్తైన గుట్టలు.. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు.. సమీపంలోనే నీటితో కళకళలాడే చెరువులు, కుంటలు, పక్షుల కిలకిల రావాలు, ఆహ్లాదకరమైన లోతట్టు ప్రాంతాల్లో జనావాసాలకు దూరంగా తాటికుంట కట్టపైన వెలసింది మైసమ్మ తల్లి. అమ్మవారు శక్తి స్వరూపులు కావటంతో ఆదివారం, గురువారం భక్తులతో కిటకిటలాడుతుంది.
25, 26, 27 తేదీల్లో జాతర
తాటికుంట మైసమ్మ జాతర నిర్వహణకు ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. 25, 26, 27 తేదీల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి రంగులు వేసి సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అమ్మవారికి అభిషేకం, నూతన పట్టు వస్త్రాలతో అలంకరణ, అర్చన, పసుపు, కుంకుమ సమర్పణ, హోమం, వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 27న భోనాలు, అన్నదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో పాటు మండల ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
ఉత్సవాలను విజయవంతం చేయాలి
తాటికుంట మైసమ్మ ఆలయ జాతర వైభవంగా నిర్వహిస్తాం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతరకు అన్ని రకాల ఏర్పాట్లను చేయిస్తున్నాం. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు అన్ని విధాలుగా సహకరించాలి. మూడు రోజులు నిర్వహించే జాతరను విజయవంతం చేయడానికి గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలి.
– యాచారం అంజయ్య, ఆలయ కమిటీ చైర్మన్
ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలి
తాటికుంట ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ముఖ్యంగా ఫారెస్టు అధికారులు ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దారిని ఏర్పాటు చేయాలి. అమ్మవారి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. ఆలయ పరిసరాల్లో దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలి. గ్రామస్తులు, భక్తులు సహకరిస్తే అటవీశాఖ అనుమతులతో ఆలయాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేయాలి.
– పొలమోని పాండు, తాటిపర్తి