సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): జన్‌ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకుంటే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఎవరి ఖాతాలో కూడా ఒక్క రూపాయి జమ చేయలేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కానీ..మొత్తం నల్లగొండ జిల్లా పైసలన్నీ ఒకరి ఖాతాల్లో పడ్డటున్నాయని, ఆయనెవరో అందరికీ తెలుసునని మంత్రి చురకలంటించారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో శనివారం లారీ డ్రైవర్లు, యజమానులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఈ సమ్మేళనానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మునుగోడు, దేవరకొండ, ఇబ్రహీంపట్నంతోపాటు పలు ప్రాంతా ల్లో వేళ్లూనుకుపోయిన ఫ్లోరోసిస్‌కు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు 68లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి మాత్రమే ఉండగా.. నేడు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలు లారీ డ్రైవర్ల, యజమానుల సమస్యలను పరిష్కరించలేదని, కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న టీఆర్ఎస్కే మద్దతు ఉంటుందని సమ్మేళనంలో లారీ అసోసియేషన్ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పాడిన పాటలకు లారీ డ్రైవర్లు, యజమానులు స్టెప్పులేసి ఆడిపాడారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, సహకార సంఘం జిల్లా చైర్మన్ మనోహర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, టీఎల్ఓఏ రాష్ట్ర అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, బూడిద నందారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు యస్కే చాంద్‌పాష, సురివి యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొయ్యాడ సుధాకర్‌గౌడ్, రాష్ట్ర కోశాధికారి వేముల భూపాల్, సలీంబాయ్, హన్మంతు వెంకటేశ్ గౌడ్ తో పాటు లారీ ఓనర్స్,డ్రైవర్లు,క్లీనర్లు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించాం..
లారీ డ్రైవర్లు, యాజమానులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి పరిష్కరించాం. ఇందుకు సంబంధించిన జీవోలను కూడా జారీ చేశాం. కేంద్రం తీసుకొచ్చిన వెహికిల్ యాక్ట్ విధానాలు ఇబ్బందికరంగా ఉండటంతో వాటిని రాష్ట్రంలో అమలు చేయలేదు. మానవతా దృక్పథంతో కరోనా కాలంలో రూ.172.57కోట్ల క్వార్టర్లీ ట్యాక్స్‌ను రద్దు చేయడమే కాకుండా, లారీ డ్రైవర్లు, యజమానులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించాం. రవాణా రంగంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం. మిగిలిన సమస్యలను సైతం పరిష్కరిస్తాం. లారీ డ్రైవర్లు, యాజమానులు తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపి అండగా నిలవాలి.
– మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
రవాణా రంగం కుదేలుకు కేంద్రమే కారణం
రవాణా రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. సంస్కరణల పేరుతో కేంద్రం మెడపై కత్తిపెట్టి రవాణా రంగాన్ని కుదేలు చేసింది. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలతో కరోనా కాలంలో వాహనాలు నడవక కొంతమంది యజమానులు ఆత్మహత్యలు సైతం చేసుకున్న సందర్భాలున్నాయి. గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించడంతోపాటు సింగిల్ పర్మిట్, ఓవర్ లోడ్ సందర్భంగా యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ లైసెన్స్‌లను రద్దు చేయడం వంటి అనేక సమస్యలను పరిష్కరించాం. ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజానీకం సైతం ప్రభుత్వానికి అండగా ఉండాలి.
– మంత్రి శ్రీనివాస్ గౌడ్
సమస్యలు పరిష్కరించింది
ప్రభుత్వమే మన దగ్గరికి వచ్చి లారీ ఓనర్స్ సమస్యలను పరిష్కరించింది. ఉమ్మడి పాలనలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. గతంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి లారీ పార్కింగ్‌కు స్థలం కేటాయించాలని కోరాం. వెంటనే దండుమల్కాపురంలో రెండెకరాల స్థలం కేటాయించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికే మా మద్దతు ఇస్తాం.
– బూడిద నందారెడ్డి, లారీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వానికి అండగా నిలవాలి
గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉన్నాం. అన్ని సంఘాలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 150 సంఘాలు పని చేస్తున్నా.. గత ప్రభుత్వాలు ఏనాడు సమస్యలు పట్టించుకోలేదు. సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి లారీ యాజమాని, డ్రైవర్లు అండగా నిలవాలి.
– నూకల భాస్కర్‌రెడ్డి,టీఎల్ఓఏ వ్యవస్థాపక అధ్యక్షుడు
267 కోట్ల ట్యాక్స్ మాఫీ చేసిండు
రవాణా రంగం పై పెండింగ్‌లో ఉన్న రూ.267 కోట్ల ట్యాక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసి ఆదుకున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ, నల్ల చట్టాలతో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కేంద్రం అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టి మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి.
– మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి,
టీఎల్ఓఏ రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్రం పై పోరాటానికి సిద్ధం కావాలి
డీజిల్ ధరలు పెంచి రవాణా రంగం పై మోయలేని భారాన్ని మోపిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం కావాలి. మన సమస్యలు పట్టించుకోని కేంద్రం… నేడు తెలంగాణ ప్రభుత్వం పై అభాండాలు వేస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎంతో మంది లారీ ఓనర్స్, డ్రైవర్ల జీవితాలు బాగుపడ్డాయి. మనమంతా కలిసికట్టుగా పని చేసి మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి.
– సురివి యాదయ్యగౌడ్,టీఎల్ఓఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కేసీఆర్‌ను ప్రధాన మంత్రి చేద్దాం
40 వేల కోట్లు టోల్ చెల్లించినా.. గత ప్రభుత్వాలు పరిష్కరించని సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాల్లో పంటలు పండటంతో ఎంతో మంది లారీ ఓనర్లకు ఉపాధి దొరికింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయి. కేసీఆర్‌ను సీఎం చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది. ప్రధాన మంత్రిని చేస్తే దేశం బాగుపడుతుంది. కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలంటే మనమంతా అండగా ఉండాలి.
– అబ్దుల్ బారీ, టీఎల్ఓఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కేటీఆర్ చొరవతో సమస్యలు పరిష్కారం
రాష్ట్రం ఏర్పడ్డాక లారీ ఓనర్స్ సమస్యలు పరిష్కరించిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుంది. గతంలో ఎన్నికల సమయంలో ఓటు వేయాలంటే ఎవ్వరికి వేయాలో తెలియని అయోమయంలో ఉండే. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి మరోమారు రాష్ట్రంలో, దేశంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పై ఉంది.