ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 22: నియోజకవర్గంలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అసంపూర్తిగా మిగిలిన వివిధ సామాజిక భవనాలను పూర్తి చేయడానికి రూ.6.9 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేయడానికి ఇప్పటికే రూ.40 లక్షలు మంజూరు చేయించామని తెలిపారు. త్వరలోనే పనులు పూర్తిచేస్తామని చెప్పారు. ప్రస్తుతం మంజూరు చేయించిన నిధులతో అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రూ.2.45 కోట్లతో 26 పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండలంలో రూ.1.6 కోట్లతో 21 పనులు, మంచాల మండలంలో రూ.1.53 కోట్లతో 15 పనులు, యాచారం మండలంలో రూ.1.32 కోట్లతో 23 పనులు చేయనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని మూడునెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవనాలన్నింటినీ వినియోగంలోకి తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా సీఎం సహాయనిధి
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీకి చెందిన లక్ష్మయ్యగౌడ్కు సీఎం సహాయనిధి ద్వారా రూ. 60 వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును శనివారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో బాధితుడికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేద ప్రజలను ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.