రంగారెడ్డి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : వానకాలం పంట కాలం ముగిసిన దరిమిలా.. రబీ పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికార యంత్రాంగం యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువడంతో రబీ సీజన్లో పంటల సాగు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈపాటికే శనగ, వేరుశనగ, కుసుమ, జొన్న, సజ్జ, కుసుమ విత్తనాలను నాటుతున్నారు. మిగిలిన పంటలకు ఇంకా సమయం ఉన్నట్లు పేర్కొన్నారు. యాసంగి వరి పంటను వచ్చే డిసెంబర్ రెండు, మూడో వారాల్లో సాగు చేపట్టనున్నారు. అధికారులు రూపొందించిన సాగు ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నారు. యాసంగి ప్లాన్‌కు సరిపడా విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు రకాల ఎరువులను సిద్ధం చేశారు. వాటిలో యూరియా, డీఏపీ, ఎస్ఎస్పీ, ఎంఓపీ, కాంప్లెక్స్ లాంటి ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాకు 40వేల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 15,609 టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకో 25వేల టన్నులు అవసరం ఉంది. కావాల్సిన వాటిని కొనుగోలు చేయనున్నారు. 40% నేపథ్యంలో ఎరువులను ఆగ్రోస్, మార్క్‌ఫెడ్, డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నారు.
52,947 ఎకరాల్లో వరి పంట సాగు
రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మహా నగరానికి చేరువగా ఉన్న నేపథ్యంలో వరి పంట, తరువాత కూరగాయల పంటలు, నూనె గింజల పంటలనే అధికంగా సాగు చేస్తుంటారు. గతేడాదితో పోల్చుకుంటే వరి సాగు (యాసంగి) దాదాపు ఐదు వేల ఎకరాల్లో అధికంగా చేయనున్నట్టు అంచనా చెబుతున్నది. ఈ వర్షకాలంలో వానలు అధికంగా కురిసి, కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులన్నీ నీటితో నిండి కళకళలాడుతున్నాయి. జిల్లాలో జలాశయాలన్నీ నిండుకున్నాయి. దీంతో పంటల సాగుకు నీటి కొరత లేకుండాపోయింది. పంటల విస్తీర్ణం కాస్త పెరిగింది. గతేడాది వరి సాగు 47,231 ఎకరాల్లో చేపట్టగా.. ప్రస్తుతం 52,947 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అన్ని పంటలవారీగా గతేడాది 86,974 ఎకరాల్లో సాగు చేయగా.. ప్రస్తుతం 95,042 ఎకరాల్లో సాగు కొనసాగనున్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు.
యాసంగి కాలంలో పత్తి సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ 50 ఎకరాల్లో ప్రణాళిక రూపొందించింది. రాబోయే యాసంగి 2022-23 సీజన్లో పంటల వారీగా విస్తీర్ణాన్ని అంచనా వేసి దానికి సరిపడు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. విత్తన సరఫరా పురోగతిలో ఉన్నది.
రాబోయే యాసంగి 2022-23 సీజన్లో పంటల వారీగా విస్తీర్ణం అంచనా వేసి, దానికి సరిపడు నాణ్యమైన ఎరువులు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
ఎరువులు ప్రణాళిక అందుబాటులో (టన్నుల్లో) (టన్నుల్లో)
యూరియా 16,000 9,126.5
డీఏపీ 5,000 1,209.92
ఎస్ఎస్పీ 1,500 318.41
ఎంవోపీ 2,500 494.74
కాంప్లెక్స్ 15,000 4,460.32
మొత్తం 40,000 15,609.89
విత్తనాలు, ఎరువుల పంపిణీకి సిద్ధం: గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
యాసంగి సీజన్లో వివిధ పంటల సాగుకు ఇప్పటికే ప్రణాళిక రచించాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులకు సకాలంలో అందజేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. యాసంగి సీజన్లో సాగు నిమిత్తం విత్తనాలు, ఎరువులను సరఫరా చేసేందుకు, సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు వ్యవసాయ శాఖ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సీజన్లో నూనె గింజల పంటలను ఎక్కువగా ప్రోత్సహిస్తు న్నాం. పొద్దుతిరుగుడు, పల్లీలు, కుసుమ (నల్ల, తెల్ల) మొదలైన పంటలను వేయాలని చెబుతున్నాం. ఇంకా జిల్లాలో వరి స్థానంలో కూరగాయల పంటలను వేసి, దిగుబడితో పాటు అధిక ఆదాయం సముపార్జించేందుకు వీలవుతుందని వీటిని కూడా ప్రోత్సహిస్తున్నాం.