పూడూరు, అక్టోబర్ 22 : సీతాఫలం పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్ట భూముల్లో సాగు చేయవచ్చును. ఈ పండ్లు కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ కలిగి ఉండి ఐస్‌క్రీమ్, పాల సంబంధిత పదార్థాల తయారీలో ఉపయోగపడుతాయి. సీతాఫలం ఆకులు, గింజలతోపాటు ఇతర భాగాల్లో అనోనైన్ అనే పదార్థం ఉండడంతో చేదుగుణం కలిగి ఉంటుంది. అందుకే సీతాఫలం ఆకులను పశువులు, మేకలు తినవు. దీని గింజల నుంచి తీసిన రసంలో కీటకనాశిని లక్షణాలుంటాయి. 27 నుంచి 30 శాతం వరకు లభించే నూనెను సబ్బుల తయారీ, పెయింట్ పరిశ్రమల్లో వాడుతున్నారు. తక్కువ పొలం ఉన్న రైతులు పొలం గట్లపైనా పెంచవచ్చును. ప్రస్తుతం 30-40 కాయలకు రూ.70-80 వరకు విక్రయిస్తున్నారు. ఇతర పండ్ల చెట్ల పెంపకం లాగా.. ఈ పండ్లు సాగుచేసేలా అధికారులు కూడా దృష్టి పెట్టాల్సివుంది.
ఈ నేలలు అనుకూలం
మురుగు నీరు పోయే సదుపాయం కలిగిన 5.5-7.5 పి.హెచ్.(ఉదజని సూచిక) గల నేలలు చాలా అనుకూలం. ఈ చెట్లు చౌడు, క్షార నేలలు మినహా అన్ని రకాల నేలల్లో బాగా పెరుగుతాయి. నీరు నిలువని చెల్క, గరుకు, ఎర్ర, గరప నేలల్లో బాగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది.
దిగుబడి
నాటిన మూడు లేదా నాలుగో సంవత్సరం నుంచి కాపు వచ్చినా.. 8-10 సంవత్సరాల నుంచి అధిక దిగుబడి పొందవచ్చు. సాధారణంగా ఒక చెట్టు 60-100 వరకు ఫలాలనిస్తుంది. ఆధునిక పద్ధతుల ద్వారా 100-150 కాయల చొప్పున ఎకరాకు 4-5 టన్నుల పండ్ల అమ్మకాలు జరుపవచ్చు. రైతులు సీతాఫలాల చెట్లను సాగు చేసి కూడా ప్రతి సంవత్సరం ఆర్థికాభివృద్ధి పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అవగాహన కల్పిస్తే మరింత దిగుబడి పెరిగే అవకాశముంది. పూడూరు మండల పరిధిలోని బాకాపూరు, కండ్లపల్లి గ్రామాలకు చెందిన కొందరు రైతులు అడవిలో లభించే సీతాఫలాలు తీసుకువచ్చి రోడ్డుపై రెండు నెలల నుంచి విక్రయిస్తున్నారు. రోజు రూ.400-500 వరకు సంపాదిస్తున్నారు.
సీతాఫలాల రకాలు
బాలానగర్ రకం సీతాఫలం 4 సంవత్సరాల తర్వాత సుమారు ఒక్కొక్క చెట్టుకు 50-200 కాయల దిగుబడి వస్తుంది. కాయలు పిరమిడ్ ఆకారంలో పెద్ద కళ్లతో పెద్ద సైజులో ఉంటాయి. కళ్ల మధ్య లేత పసుపురంగు నుంచి ఆరెంజ్ రంగుతో చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఫలాలు మధురమైన రుచి, గరుకైన గుజ్జుతో 200 గ్రాముల సగటు బరువుతో 27 శాతం చక్కెర కలిగి ఉంటుంది. అర్కసహాన్ రకం చెట్టుకు సుమారు 80-160 వరకు దిగుబడి వస్తుంది. హైలాండ్జెమ్ X మమ్మోత్ అనే రకాలను సంకరపరచి రూపొందించిన రకం. కాయలు గుండ్రంగా, చర్మంపై కళ్లు ఉన్నా స్పష్టంగా లేకుండా నునువుగా ఉంటాయి. ఈ రకం కాయలు 300గ్రా. బరువు కలిగి ఉంటాయి. చక్కెర శాతం 30 ఉండి అత్యంత తియ్యగా ఉంటాయి. గింజలు 5-8 వరకు మాత్రమే ఉంటాయి.
ఎరువులు
50 కిలోల పశువుల ఎరువు, కిలో ఆముదపు పిండి, కిలో ఎముకల పొడిని చెట్టు మొదట్లో ఒకసారి జూన్-జూలై నెలల్లో వేసుకోవాలి. 250గ్రా. నత్రజని, 125గ్రా. భాస్వరం, 125గ్రా. పొటాష్‌ను చెట్టు మొదట్లో తేమ ఉన్నపుడు రెండుసార్లు వేసుకోవాలి.