సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవాలని జంట పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినత్సవంలో పలువురు అధికారులు సూచించారు. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆయా కార్యక్రమాలకు పోలీస్ కమిషనర్లు మహేశ్‌భగవత్, స్టీఫెన్ రవీంద్రలు హాజరై, అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1959 ఇండో-చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టిందన్నారు. అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారన్నారు. వారి త్యాగాలను గుర్తు చేస్తూ అప్పటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు.
అంబర్‌పేట్‌లోని కార్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో అమర వీరుల స్థూపానికి సీపీ మహేశ్ భగవత్ ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. దేశంలో ఈ ఏడాది 264 మంది పోలీసులు(ఆగస్టు 31వ తేదీ వరకు), అందులో రాచకొండ పరిధిలో 16 మంది పోలీసులు విధి నిర్వహణలో మృతి చెందారన్నారు. పోలీసు సంక్షేమం కోసం వైద్య శిబిరాలు, కొవిడ్ వ్యాక్సినేషన్, ఫ్యామిలీ హెల్త్ చెకప్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాచకొండ పోలీసులు నిర్వహించిన రక్తదాన శిబిరానికి హైఎస్ట్ బ్లడ్ డోనేషన్ అవార్డు -2022 దక్కిందన్నారు. అక్టోబర్ 21 నుంచి 31వ వరకు పోలీస్ ఫ్లాగ్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో విద్యార్థులకు, సామాన్య పౌరులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబ సభ్యులను సీపీ సన్మానించారు. ఈ సమావేశంలో డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, రక్షితమూర్తి, సలీమా, అదనపు డీసీపీ నర్మద, షమీర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్, అక్టోబర్ 21 : ప్రపంచమంతా నిద్రపోతుంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాపలా కాస్తుంటారని, పోలీసుల త్యాగాలను స్మరింకుకునేందుకు ఏటా పోలీసుల సంస్మరణ దినం నిర్వహించుకుంటున్నామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎండనక, వాననక, రాత్రి, పగలు లేకుండా కుటుంబంతో కలిసి నిర్వహించుకునే పండుగలను సైతం చేసుకోకుండా ప్రజల రక్షణ కోసం పోలీసులు సేవలందిస్తారన్నారు.
కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరవీరులైన పోలీసులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో అందరికంటే ముందు నిలిచి సేవలందించింది పోలీసులేనని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు అందరూ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎంఏ రషీద్, డీటీసీ అదనపు ఎస్పీ మురళి, డీఎస్పీలు సత్యనారాయణ, కరుణాకర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని అమర వీరుల స్మారక స్థూపానికి సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళులర్పించి, రెండు నిమిషాలు శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన వారున్నారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అమోఘమన్నారు.
కొత్తగా పోలీస్ బాధ్యత నిర్వర్తించే వారికి స్పూర్తిని, నూతనోత్తేజాన్ని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకోవడం ప్రధాన ఉద్దేశమన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆమనగల్లు ఎస్సై కె.హనుమంత్‌రెడ్డి, తలకొండ పల్లి పోలీస్ కానిస్టేబుల్ ఫీహీముద్దీన్, ఆర్మ్డ్ కానిస్టేబుల్ ఈశ్వర్రావు సేవలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీలు శ్రీనివాస్‌రావు, శిల్పవల్లి, జగదీశ్వర్‌రెడ్డి, కవిత తదితరులు పాల్గొన్నారు.