విధి నిర్వహణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన ఎంతోమంది పోలీసు అమరవీరులకు వందనం.. ప్రజాసేవ, దేశ రక్షణే కర్తవ్యంగా అసువులు బాసిన పోలీసు వీరులను స్మరించుకోవడం మన కనీస బాధ్యత.. వారి త్యాగాలను స్మరించుకుంటూ.. వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. పౌరులుగా మనవంతు చేయూతనందించే ప్రయత్నం చేద్దాం. ప్రతిఏటా పోలీసు శాఖ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినాన్ని జరుపుకొంటున్నది. పోలీసు శాఖ ప్రజాసేవకు పునరంకితమవుతున్నది. ప్రజాసేవను పరమావధిగా భావించి ఎంతోమంది పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారు. అటువంటి వారిలో ఐపీఎస్ అధికారులు పరదేశీ నాయుడు, వ్యాస్, ఉమేశ్‌చంద్ర, కృష్ణప్రసాద్ వంటివారు ఉన్నారు.
– ఇబ్రహీంపట్నంరూరల్/షాద్‌నగర్, అక్టోబర్ 20
దేశంలో అంతర్గత శాంతిభద్రతల పరిరక్షణ ఎంతో ముఖ్యమైనది. దేశంలో అనేక మతాలు.. కులాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు ఉన్నందున వారంతా కలిసిమెలిసి శాంతియుతంగా జీవించేలా చూడటం పోలీసుల ధర్మం. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ జీవన తత్వం. అయితే.. ఉగ్రవాదం, తీవ్రవాదం, కులఘర్షణలు, మతతత్వశక్తులు, అసాంఘిక శక్తులు, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి సామాజిక జాడ్యాలు ప్రజల జీవితాన్ని అశాంతిపాలు చేస్తున్నాయి. దేశంలో అంతర్గత శాంతిని హరించి వేస్తూ కర్ఫ్యూలు, 144 సెక్షన్లు, బంద్‌లు, హర్తాళ్లు కొనసాగుతుంటే ఏ దేశమైనా ఎలా అభివృద్ధి చెందుతుంది. ఈ అంతర్గత శాంతిని అంతమొందించే ప్రయత్నంలో పోలీసులు మహోన్నత త్యాగాలు చేస్తున్నారు. అమూల్యమైన తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఆధిపత్య పోరులో నలుగురు పోలీసులు మృతిచెందారు. పోలీసుల సంస్మరణ దినంలో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఓపెన్ హౌజ్‌లు, రక్తదాన శిబిరాలు, స్మారక క్రీడలు నిర్వహిస్తున్నారు. అసువులు బాసిన పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సహాయ సహకారాలు అందిస్తున్నది.
పోలీసు విధి నిర్వహణ ఎంతో శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగాల్లో కొన్ని గంటలు మాత్రమే విధులు నిర్వహించి మిగతా సమయంలో ఆనందంగా ఉంటారు. కాని, పోలీసులు 24గంటలు ఆన్‌డ్యూటీలో ఉండి ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతలను పరిరక్షిస్తారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించడం కష్టం. ప్రజలు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే. ప్రభుత్వ పాలనలో పోలీసులదే ప్రథమపాత్ర. డేగకళ్లతో ప్రజలను, సరిహద్దులను కాపాడుతూ శత్రుసైన్యాలతో చివరి రక్తపుబొట్టు ఉన్నంతవరకు పోరాడి, ప్రజల కోసం ప్రాణాలనే అర్పిస్తున్నారు.
తెలంగాణ సర్కార్ తీసుకున్న ఫ్రెండ్లీ పోలీస్ నిర్ణయంతో పోలీసులు ప్రజలతో మమేకయ్యారు. ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా సామాన్య ప్రజలు వెంటనే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటుతో మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించేందుకు.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అమరులైన పోలీసులకు నివాళులర్పించేందుకు పోలీసు అమరవీరుల దినం సందర్భంగా పోలీసులు చేయనున్న వివిధ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొననున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుశాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రతిక్షణం ప్రజల్లోనే ఉంటూ.. ప్రజల కోసం అనుక్షణం కష్టపడి పనిచేస్తున్న పోలీసుశాఖలో పకడ్బందీ పరిణామాలు తీసుకువచ్చారు. ప్రతి మండలానికి పోలీస్ స్టేషన్, పెట్రోలింగ్ వాహనాలు, షీటీమ్‌తో పాటు ప్రత్యేక సిబ్బందిని నియమించి క్రైం రేట్‌ను పూర్తిగా తగ్గించారు. ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో హత్యలు, అత్యాచారాలు, అల్లర్లు, రోడ్డు ప్రమాదాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడేందుకు పోలీస్ శాఖ అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం కృషిచేస్తున్నది.
శాంతిభద్రతల పరిరక్షణే పరమాధిగా భావిస్తారు పోలీసులు. కత్తిమీద సాములాంటి పోలీసు ఉద్యోగాన్ని సాధించడం కోసం యువకులు సైతం ఉత్సాహం చూపుతుంటారు. ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా నియమిత పని గంటలు, సెలవులు ఉంటాయి కానీ పోలీసులు మాత్రం 24 గంటలు విధి నిర్వహించాల్సి ఉంటుంది. కంటి మీద కునుకు లేకుండా రేయింబవళ్లు ప్రజా రక్షణకు కృషి చేస్తుంటారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసులు ఎన్నో సేవలు అందించారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించడం ఎంతో కష్టం. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే ఆశ్రయించేది పోలీసులనే. పోలీసులు ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడుతూ దుర్మార్గుల పాలిట సింహ స్వప్నాలుగా నిలుస్తున్నారు.
1997 మార్చి 31న యాచారం పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు దాడిచేశారు. అప్పటి ఎస్సై మనోహర్‌రావు విధులు నిర్వహించి, ఇంటికి వెళ్లిన అనంతరం స్టేషన్‌పై మావోయిస్టులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి.. మందుపాతర అమర్చి పోలీసుస్టేషన్‌ను పేల్చివేశారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు రాజేశ్వర్‌రావు, జమీర్‌అహ్మద్ దుర్మరణం పాలయ్యారు.
2001లో మంచాల ఎస్సైగా పనిచేస్తున్న సైదయ్య, కానిస్టేబుల్ సాయిలు మంచాల మండలం బండాలేమూర్ గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. మావోయిస్టులు మందుపాతర పేల్చి వారిని మట్టుబెట్టారు.
ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. నేరాల నివారణ కోసం పట్టణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. వాటితో కలిగే లాభాలను ప్రజలకు వివరించాం. ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలి. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు జోహార్లు.
– నవీన్‌కుమార్, సీఐ షాద్‌నగర్
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల కర్తవ్యం. ప్రజా రక్షణ కోసం పోలీసులు 24 గంటలు విధులు నిర్వహిస్తారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను ప్రజలు గుర్తించాలి. తమ ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు జోహార్లు. వారి త్యాగాలు మరువలేనివి.
– కుశల్కర్, ఏసీపీ, షాద్‌నగర్