వికారాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): వానకాలంలో పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు వికారాబాద్ జిల్లా అధికారులు సన్నద్ధమ య్యారు. వర్షాలు సమృద్ధిగా కురువడంతో జిల్లాలోని రైతులు వరిని అధికంగా సాగు చేయడంతో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ దాదాపుగా వెయ్యి క్వింటాళ్ల వరకు ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. అయితే రైతులు ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు రాకుండా గ్రామాలవారీగా ఏఈవోలు టోకెన్లను జారీ చేయనున్నా రు. అయితే జిల్లాలో 75 వేలమంది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశా రు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినది. కాగా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో 121 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 51, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 33, ఏఎంసీ ఆధ్వర్యంలో 10, ఐకేపీ ఆధ్వర్యంలో 24, ఎఫ్సీఎస్ ఆధ్వర్యంలో మూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చేనెల మొదటి వారంలో కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. అయితే అధిక విస్తీ ర్ణం లో వరి పంట సాగైన దృష్ట్యా రైతులకు ఇబ్బందులు కలుగకుండా మూడు నుంచి నాలుగు గ్రామాలకొక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా ఈ సీజన్లో 2.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. అదేవిధంగా ఒకేసారి రైతులు కొనుగోలు కేంద్రాలకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ 50 మంది రైతుల నుంచి వెయ్యి క్విం టాళ్ల ధాన్యాన్ని సేకరించనున్నారు. ఇందుకోసం ఏఈవోలు గ్రామాలవారీగా రైతులకు ఏఏ తేదీ ల్లో కొనుగోలు కేంద్రాలకు రావాలో టోకెన్లను జారీ చేయనున్నారు. కాగా జిల్లాకు 60 లక్షల గన్నీ సంచులు అవసరం కాగా, ప్రస్తుతం 20 లక్షల వరకు అందుబాటులో ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన వి వచ్చేనెల మొదటి వారంలోగా అందుబాటు లో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు 59 గోదాములను సిద్ధం చేస్తున్నారు. కేంద్రాల నుంచి ధాన్యాన్ని గోదాములకు తరలించే పనిని నాలుగు ఏజెన్సీలకు అధికారులు అప్పగించారు. టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ యంత్రాలను మార్కెటింగ్ శాఖ ఈనెలాఖరులోగా అన్ని కొనుగోలు కేంద్రాలకు సమకూర్చనున్నది. అయితే ఈ వానకాలంలో 1.34 లక్షల ఎకరాల్లో వరి సాగు కా గా.. పరిగి, కుల్కచర్ల, దోమ, బొంరాస్పేట, దౌల్తాబాద్, కొడంగల్, తాండూరు, యాలాల, ధారూరు, మర్పల్లి, కోట్పల్లి మండలాల్లో ఎక్కువగా సాగు అయ్యింది.
రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వానకాలానికి సంబంధించి మద్దతు ధర ను ప్రభుత్వం పెంచింది. ధాన్యం గ్రేడ్-ఏ రకానికి క్వింటాలుకు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 చెల్లించనున్నది. గతేడాది వరకు గ్రేడ్-ఏకు రూ.1960, సాధారణం రూ. 1940 లుగా ధాన్యాన్ని సేకరించింది.
ధాన్యాన్ని విక్రయించే రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వచ్చేనెల మొదటి వారం నుంచే కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ సీజన్లో సాగు విస్తీర్ణం పెరుగడం.. దిగుబడి అధికంగా వస్తుందన్న అంచనాల నేపథ్యంలో గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులందరూ కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధరను పొందాలి.
– నిఖిల, వికారాబాద్ కలెక్టర్