బొంరాస్‌పేట, అక్టోబర్ 19 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్‌గా పని చేస్తున్న ఈ.వినయ్‌కుమార్ బతుకమ్మ పాటలపై పరిశోధన చేశారు. పీహెచ్డీ పట్టా కోసం ఆయన ఐదేండ్ల పాటు ‘తెలంగాణ సంస్కృతిలో బతకమ్మ పాటలు-సామాజిక విశ్లేషణ’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధానాచార్యులు డాక్టర్ అజ్మీరా సిల్మానాయక్ పర్యవేక్షణలో ఆయన తన పరిశోధనను కొనసాగించి ఇటీవలే తన పరిశోధన పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఓయూ ఉన్నతాధికారులు వినయ్‌కుమార్ సమర్పించిన పరిశోధనను ఆమోదించి సమాచారం పంపించారు. త్వరలో నిర్వహించే స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టా అందుకోనున్నారు.
కులకచర్ల మండలం ఘణాపూర్ గ్రామంలోని పేద కుటుంబానికి చెందిన వెంకటయ్యగౌడ్, సత్యమ్మల కుమారుడైన వినయ్‌కుమార్ ఎంఏ, ఎంఈడీ పూర్తి చేసి 2017 టీఆర్టీలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. 2014 సంవత్సరంలో నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష(ఎన్ఈటీ)లో ఉత్తీర్ణుడు కావడంతో 2017 సంవత్సరంలో పీహెచ్డీ చేయడానికి అవకాశం లభించింది. తన ఐదేండ్ల పరిశోధనలో తెలంగాణలోని మహబూబ్‌నగర్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించి బతుకమ్మ పండుగలో ఏ ఏ రకమైన పాటలు మహిళలు పాడుతున్నారు, ఆ పాటల ప్రభావం ప్రజలపై ఎలా ఉంది అనే విషయాలను పరిశీలించి పరిశోధన చేశారు. పరిశోధన చేసిన విషయాలను ఆరు అధ్యాయాల్లో పొందుపర్చి సమర్పించారు. మొదటి అధ్యాయంలో తెలంగాణ భౌగోళిక స్వభావం, చరిత్ర సంస్కృతి-సాహిత్యం, బతుకమ్మ, రెండో అధ్యాయంలో జానపద విజ్ఞానం-బతుకమ్మ పండుగ, మూడో అధ్యాయంలో వివిధ ప్రక్రియల్లో బతుకమ్మ పండుగ, నాలుగవ అధ్యాయంలో బతుకమ్మ పండుగ పాటలు-భాషా విశేషాలు, ఆరో అధ్యాయంలో బతుకమ్మ పాటలు-స్త్రీల మనోభావాలు అనే అంశాలను పొందుపరిచారు. వీటితోపాటు బతుకమ్మను తయారు చేసే విధానం, పూజించే పద్ధతి, వివిధ రాష్ర్టాలు, దేశాల్లో బతుకమ్మను పోలిన పండుగలను ఏమని పిలుస్తారు, ఏ విధంగా జరుపుకుంటారో తన పరిశోధన పుస్తకంలో వివరించారు.
పీహెచ్డీ రావడం ఆనందంగా ఉంది
తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పాటలు-సామాజిక విశ్లేషణ అనే అంశంపై తాను చేసిన పరిశోధనకు పీహెచ్డీ రావడం ఆనందంగా ఉంది. మా స్వగ్రామంలో పీహెచ్డీ పట్టా అందుకుంటున్న మొదటి వ్యక్తిని నేనే కావడం నాకు గర్వకారణం. నా పరిశోధనకు నా తమ్ముడి సహకారం ఎంతో ఉంది. మా పాఠశాల ఉపాధ్యాయులు, ఓయూ ప్రొఫెసర్లు, స్నేహితులు కూడా బాగా సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు.
-వినయ్‌కుమార్, తెలుగు ఉపాధ్యాయుడు, బొంరాస్‌పేట జడ్పీహెచ్ఎస్