రంగారెడ్డి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడా లేనివిధంగా రంగారెడ్డి జిల్లా అతి పెద్ద ఆభరణాల తయారీ క్షేత్రంగా మారబోతున్నది. బంగారం, వజ్రాల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మలబార్ తమ అతి పెద్ద రిఫైనరీ, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు జిల్లాలో నిర్మాణ పనులు చేపట్టారు. యూనిట్‌కు ఆ సంస్థ చైర్మన్ అహ్మద్‌తో కలిసి మంత్రి కేటీ రామారావు ఇటీవల శంకుస్థాపన చేశారు. మహేశ్వరంలో రూ.750 కోట్ల పెట్టుబడితో 2.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నది. దీని ద్వారా 2,750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది నవంబర్ 30 నాటికి మలబార్ సంస్థ స్థాపించి 30 ఏండ్లు అవుతున్న దరిమిలా.. మహేశ్వరంలో నిర్మిస్తున్న యూనిట్ సైతం అందుబాటులోకి వచ్చేలా సంస్థ యాజమాన్యం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా మలబార్ సంస్థకు సంబంధించి 17 రిటైల్ షోరూములున్నాయి. ఆయా షోరూముల్లో వెయ్యి మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఇందులో భాగంగానే రిటైల్ షాపులను మరింతగా విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. 2023వ ఆర్థిక సంవత్సరంలో 97 షోరూములను కొత్తగా ప్రారంభించాలని మలబార్ సంస్థ సంకల్పించింది. దేశంలో 60, విదేశాల్లో 37 షోరూములను ఏర్పాటు చేయనున్నారు. మలబార్ గోల్డ్&డైమండ్స్ సంస్థకు ‘ఖతార్, దుబాయి, షార్జా, బెహ్రెయిన్’లలో తయారీ యూనిట్లు ఉండగా.. ఇండియాలో ప్రస్తుత యూనిట్‌తో కలుపుకొని తొమ్మిది చోట్ల ఉన్నాయి.
ఉపాధి అవకాశాలు కల్పించేలా.. అడుగులు
నిరుద్యోగులు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ దిశలో భాగంగానే ప్రభుత్వం ప్రగతి పథం వైపు అడుగులు వేస్తున్నది. రాష్ట్రం ఆర్థికంగా వృద్ధిలోకి రావాలని, ఉపాధి మార్గాలు మెరుగవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. పెట్టుబడులను ఆకర్షించి, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వినూత్న పరిశ్రమలను నెలకొల్పేలా సరికొత్త విజన్‌తో ప్రభుత్వాధినేతలు ముందుకెళ్తున్నారు. ఈ మలబార్ సంస్థను స్ఫూర్తిగా తీసుకొని మరికొన్ని ఇతర సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జెమ్స్, జ్యవెలరీ రంగాలను ప్రభుత్వం గుర్తించి మరింతగా ప్రోత్సహిస్తున్నది.
పూర్తిస్థాయి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం
మహేశ్వరంలో 3.7 ఎకరాలు, 2.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తిస్థాయి డిజైనింగ్ స్టూడియో, రీసెర్చ్&స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్‌కు ఆటోమేటెడ్ గిడ్డంగి సౌకర్యం కూడా ఉంది. యూనిట్ విస్తీర్ణంలో 33 శాతం గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నారు. కాగా, మలబార్ సంస్థ ఏడాదికి 10 టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలను ఉత్పత్తి చేసే వ్యూహంతో ఉన్నది. బంగారు శుద్ధి సామర్థ్యం ఏడాదికి 180 టన్నులు లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక్కడి యూనిట్ రిటైల్ మార్కెట్‌కు మద్దతు ఇస్తూ.. దానిని ప్రోత్సహించే దిశగా పయనిస్తున్నది. మలబార్ గ్రూప్ మిషన్ ‘ఇండియాలో తయారు చేసి.. ప్రపంచానికి మార్కెట్ చేయి..’ (మేక్ ఇన్ ఇండియా, మార్కెట్ టు ద వరల్డ్) దిశగా బలోపేతం చేసేలా అడుగులు వేస్తున్నది. యూనిట్లో బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు, ప్లాటినం, అన్‌కట్ డైమండ్స్‌తో సహా అనేక రకాల నగల తయారీని చేపట్టనున్నారు. ఇక్కడ ఇటలీ, అమెరికా, జర్మనీలకు చెందిన నిపుణుల సహకారంతో సీఎన్సీ మ్యాచింగ్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన చైన్ మేకింగ్ మెషిన్లు, లేజర్ కట్ మెషిన్లు ఉపయోగించనున్నారు. ఈ తరహా ఉత్పత్తుల మేరకు వివిధ విభాగాల్లో 2,750 మందికి ఉద్యోగ భృతి కల్పించనుంది.
పలు పరిశ్రమలు.. ఉపాధి మార్గాలు
జిల్లాలో ఇప్పటికే ప్రముఖ రైల్వే కోచ్ తయారీ కంపెనీ అయిన మేధా సెర్వో డ్రైవ్స్ రూ.625 కోట్లతో నెలకొల్పబడింది. ఇందులో 150 మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే, ప్రముఖ టైర్ల కంపెనీ స్పిన్ మ్యాక్స్ రూ.250 కోట్లతో తన ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిలోనూ ప్రత్యక్షంగా 200 మందికి పైగా ఉపాధి లభిస్తున్నది. ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కేటెక్స్ గ్రూప్ సీతారాంపూర్‌లో రూ.1400 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభ్యం కానుంది. ఇంకా, ప్రముఖ సంస్థ ఇస్టర్ ఫిల్మ్‌టెక్ రూ.1400 కోట్ల పెట్టుబడితో చందనవల్లి గ్రామంలో నిర్మాణం చేపడుతున్నది. ఈ సంస్థలోనూ 1500 మందికి ఉపాధి దొరకనుంది.
సమర్థవంతమైన ప్రభుత్వ పాలసీల వల్లే..
సమర్థవంతమైన రాష్ట్ర ప్రభుత్వ పాలసీల కారణంగా ప్రపంచ ఖ్యాతి గాంచిన ఎన్నో కంపెనీలు జిల్లాలోకి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. ‘వెల్స్పన్, విప్రో, గూగుల్, అమేజాన్, పీ అండ్ జీ (ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్), ప్రోకర్ణ గ్రానైట్స్, మైక్రోమ్యాక్స్, కటెర్రా, చిరిపాల్’ లాంటి కంపెనీలు స్థానికంగా నెలకొల్పబడ్డాయి. వాటి కారణంగా స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ భృతి లభించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తున్నాయి.
– జే.రాజేశ్వర్‌రెడ్డి, జాయింట్ డైరెక్టర్, జనరల్ మేనేజర్&చైర్మన్, ఎంఎస్ఈఎఫ్సీ, జిల్లా పరిశ్రమల కేంద్రం, రంగారెడ్డి జిల్లా