ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 19 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు ధ్వంసమైన కల్వర్టులు, తెగిన చెక్‌డ్యాంలు, కాల్వలను తక్షణమే మరమ్మతులు చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాగర్ రహదారిలోని శ్రీఇందు కళాశాల వద్ద వరదకు కొట్టుకుపోయిన కల్వర్టును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారిలోని శ్రీఇందు కళాశాల సమీపంలో కల్వర్టు ఇటీవల వరదకు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారిందని, రాత్రి సమయంలో వాహనదారులు కల్వర్టు వరదలో పడి కొట్టుకుపోయే ప్రమాదముందన్నారు. దీంతో తక్షణమే ఈ కల్వర్టుకు మరమ్మతు పనులు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల పెద్దచెరువు వరద పెద్ద ఎత్తున వస్తున్నదని అన్నారు. చెరువుకు వరద వస్తునన్ని రోజులు అలుగు దుంకి వరద పొంగిపొర్లే అవకాశముందన్నారు. దీంతో సాగర్ రహదారిలోని కల్వర్టుతో పాటు బైపాస్‌రోడ్డులో కూడా ప్రమాదానికి మించి వర్షంనీరు పారుతున్నదని అన్నారు. ఈ కల్వర్టుతో పాటు తట్టిఖానాలో కొట్టుకుపోయిన చెక్‌డ్యాంకు కూడా వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పోలీసు, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.