యాచారం, అక్టోబర్ 18 : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, ఎప్పటికప్పుడూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయం, పశుపోషణ, విద్య, విద్యుత్, వైద్యం, హార్టికల్చర్, గ్రామీణాభివృద్ధి, ఈజీఎస్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. విద్యుత్ సమస్యలు అధికంగా ఉన్నాయని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు వసూళ్లు చేయడంలో చూపిస్తున్న చొరవ సమస్యలు పరిష్కరించడంలో చూపించడం లేదని ఏఈ సందీప్‌కుమార్‌పై సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో బిల్లులు ఆలస్యంగా కొట్టడంతో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సభ్యులు కోరారు. మిషన్ భగీరథ నీటి సామర్థాన్ని పెంచాలని ఏఈ రజిత దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో కూలీలందరికీ ఉపాధి పనులు కల్పించడంతో పాటుగా పెండింగ్ బిల్లులను చెల్లించేలా చర్య లు తీసుకోవాలని ఏపీవో లింగయ్య దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీపీ సుకన్య మాట్లాడుతూ..మండల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, సర్పంచ్‌లు బందె రాజశేఖర్‌రెడ్డి, పెద్దయ్య, రమేశ్, జగదీశ్, ఎంపీటీసీలు లక్ష్మమ్మ, రజిత, బాబు ఎంపీటీసీలు, మండల అధికారులు పాల్గొన్నారు.