ఇబ్రహీంపట్నం రూరల్, అక్టోబర్ 18;ఒకప్పుడు రైతులే అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. రాష్ట్రమొచ్చాక స్పష్టమైన మార్పులొచ్చాయి. అధికారులు రైతుల వద్దకే వెళ్లి సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక సదస్సులు నిర్వహించి సేంద్రియ ఎరువులతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. ఏఏ మండలాల్లో ఏఏ పంటలను సాగు చేస్తున్నారో తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నారు. అన్నదాతకు అండగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితాలనిస్తున్నది. సాగు నుంచి పంట అమ్మడం వరకు అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు దిశానిర్దేశం చేస్తుండడంతో నాడు భారం అనుకున్న ఎవుసం నేడు పండుగలా మారింది.
గత పాలకుల హయాంలో తెలంగాణ రాష్ట్రంలో దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న రీతిలో పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే రైతాంగ ప్రయోజనాల కోసం రైతుబంధు, క్రాప్ కాలనీలు, పంటల బీమా, రైతు బీమా, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పరికరాలు అందజేయడంతోపాటు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రైతులు అతితక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడించేలా వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో ప్రతి ఏఈవోకు క్లస్టర్ పరిధిలో 50-100 ఎకరాల వరకు టార్గెట్లు విధించి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగానే వరి సాగులో వెదజల్లే పద్ధతి, భూమిలో భాస్వరం కరిగించు బ్యాక్టీరియా, పచ్చిరొట్ట ఎరువుల వాడకం, భూసార పరీక్షలతోపాటు పంటలకు విడుతలవారీగా వాడాల్సిన ఎరువుల విధానంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఇతర రైతులను ఫీల్డ్ విజిట్ చేయించి అమలుచేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు.
రసాయన ఎరువులను తగ్గించడమే ప్రధాన లక్ష్యం
రైతులు సరైన అవగాహనలేక ఇష్టానుసారంగా రసాయన ఎరువులు వాడటం ద్వారా భూమి సారాన్ని కోల్పోవడంతో తక్కువ దిగుబడి వస్తున్నది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున ఈ విధానాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉత్తమ రైతులు, వ్యవసాయాధికారులతో ప్రత్యేకంగా చర్చిస్తున్నది. రైతులు వరి సాగుకు నాలుగు దఫాలుగా ఎరువులు చల్లాల్సి ఉండగా.. ఒకటి లేదా రెండుసార్లు పంటలకు ఇష్టానుసారంగా ఎరువులు వేయడం ద్వారా తీవ్రంగా నష్టపోతున్నారు. భూసార పరీక్షలు చేయించడం, పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయడం, భూమిలో పంటలకు సరిపడా భాస్వరం అందించే ఎరువులను వాడటం వంటి వాటిపై పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానం ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మంచి ఫలితాలనిస్తుండటంతో ప్రతి రైతు ఈ విధానాన్నే అవలంబించేలా వచ్చే యాసంగి పంటల సాగులో చేపట్టేందుకు వ్యవసాయాధికారులు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విధానం ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఏడీఏ సత్యనారాయణ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్నది.
పచ్చిరొట్ట ఎరువులతో మంచి దిగుబడి
పొలంలో పంటల సాగుకు నెలరోజుల ముందు పచ్చిరొట్ట ఎరువులను సాగుచేసి కలియదున్నితే పచ్చిరొట్ట ఎరువు బాగా పనిచేస్తుంది. పశువుల ఎరువులు కూడా సక్రమంగా దొరుకని సమయంలో ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది. ఈ విధానాన్ని ప్రతి ఏఈవో క్లస్టర్ పరిధిలో 50 ఎకరాల చొప్పున ఈ వర్షాకాలం పంటల సాగులో ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయించారు. జిల్లావ్యాప్తంగా 4350 ఎకరాల్లో పచ్చిరొట్టతో కలియదున్నడం ద్వారా మంచి దిగుబడులు వస్తున్నాయని రైతులు తెలిపారు. ప్రతి రైతు ఈ విధానంపై దృష్టి సారించేలా వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కల్పించి అమలు చేయిస్తున్నారు. వరిసాగుకు ముందు పచ్చిరొట్టతో కలియదున్నడం ద్వారా గతంలో 30 బస్తాలు వచ్చే వరిధాన్యం.. ఈసారి 50 బస్తాల వరకు వచ్చే అవకాశముందని చర్లపటేల్‌గూడ గ్రామానికి చెందిన రైతు అంజిరెడ్డి తెలిపారు.
తగిన మోతాదులో ఎరువులు వాడాలి
ప్రభుత్వం స్లిట్ అప్లికేషన్ పద్ధతిలో పంటలకు ఎరువులను వాడాలని సూచిస్తున్నది. రైతులు ముందుగా భూసార పరీక్ష కేంద్రాలకు మట్టి నమూనాలను తీసుకెళ్లి వాటి ఫలితాల ప్రకారం తమ పంటలకు కావాల్సిన మోతాదులో ఎరువులను వాడాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతులు పంటల సాగు సమయంలో ఒక్కసారి.. మధ్యలో మరోసారి పంటలకు రసాయన ఎరువులను వాడి వదిలేయడం ద్వారా పంట దిగుబడి తగ్గుతుంది. భూసార పరీక్షలు నిర్వహించిన ఫలితాల ఆధారంగా పంటలు వేసినప్పటి నుంచి కోత దశకు వచ్చేవరకు నాలుగైదుసార్లు తగిన మోతాదులో ఎరువులను ఎరువులు వాడాలని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫీల్డ్‌లోనే..
వ్యవసాయంలో నూతన విధానాన్ని అమలుచేయడం కోసం వ్యవసాయ విస్తరణ అధికారులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫీల్డ్‌లోనే ఉంటూ రైతులకు సలహాలు, సూచనలు చేస్తూ.. వెదజల్లు పద్ధతి, ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల వాడకం, పంటల సమయంలో ఎరువుల వాడకం వంటి విధానంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఏఈవోలకు ప్రభుత్వం కేటాయించిన ఏఈవో లాగిన్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తున్నారు. ఏఈవోల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రతి నాలుగైదురోజులకోసారి మండలస్థాయి, డివిజన్‌స్థాయి, జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అధికారులు ఫీల్డ్‌లోనే రైతుల వద్దే ఉండి చేపట్టాల్సిన పనులను చేయిస్తున్నారు.
వరిలో వెదజల్లే పద్ధతి
వరి సాగు చేయాలంటే ముందుగా ధాన్యాన్ని సేకరించి, నానబెట్టి.. గింజలు మొలకెత్తిన తర్వాత తూకంపోసి, నారు పెరిగిన తరువాత పొలంలో నాటేందుకు 30 రోజుల సమయం పడుతుంది. వ్యవసాయ కూలీలు రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఒక్కో కూలీకి రూ.500-1000 వరకు ఖర్చవుతుంది. ఈ విధానంతో ప్రతి ఎకరాకు కూలీలు, మందులు, యంత్రాల ఖర్చులు రూ.10వేల వరకు ఖర్చొస్తుంది. ఈ ఖర్చులు తగ్గించడం, సమయం ఆదా చేసేందుకు ప్రభుత్వం వెదజల్లే విధానాన్ని అమలు చేసింది. ఈ పద్ధతి ద్వారా రైతు వరి ధాన్యాన్ని నాలుగైదురోజుల పాటు నానబెట్టి మొలకెత్తిన ధాన్యాన్ని సిద్ధం చేసిన పొలంలో వెదజల్లితే మంచి ఫలితముంటుంది. దీనికి కూలీలు కూడా అవసరముండదు. ఈ విధానంతో రైతుకు సమయం ఆదా కావడంతోపాటు కూలీల అవసరం లేకుండా మంచి దిగుబడి సాధించే అవకాశముంది. ప్రతి క్లస్టర్ పరిధిలో 100 ఎకరాల్లో జిల్లావ్యాప్తంగా 8700 ఎకరాల్లో వ్యవసాయాధికారులు రైతులతో సాగు చేయించారు. ఈ విధానంతో ఈసారి పంట బాగా వచ్చిందని పలువురు రైతులు తెలుపుతున్నారు.
వ్యవసాయాధికారుల సలహాలతో పంట బాగా వచ్చింది
– మొద్దు అంజిరెడ్డి, రైతు
వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఈ ఏడాది మా పొలంలో వరిపంటను సాగు చేసే ముందు ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఎరువును వేశాను. గతంలో 30 క్వింటాళ్ల వరకు వరిధాన్యం రాగా.. ఈసారి 40-50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేలా కనిపిస్తున్నది.
ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు
– సత్యనారాయణ, ఏడీఏ, ఇబ్రహీంపట్నం
గతంలో దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రాష్ట్రప్రభుత్వం వినూత్న పద్ధతుల్లో పంటల సాగు చేయిస్తున్నది. ప్రభుత్వం తలపెట్టిన వెదజల్లు పద్ధతితోపాటు పచ్చిరొట్ట ఎరువులు, సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఎరువుతో పాటు పంటల సాగు విధానంపై భూసార పరీక్షలు చేయించి అవసరమైన ఎరువుల వాడకం ద్వారా రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ప్రతి ఏఈవో పరిధిలో నిర్దేశించిన టార్గెట్ ప్రకారం పంటలను సాగు చేయించాం. ఈ విధానం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించే అవకాశముంది. ఈ విధానం ప్రతి రైతు అమలుచేసేలా అవగాహన కల్పిస్తున్నాం.
వినూత్న పద్ధతుల్లో పంటల సాగుకు ప్రోత్సాహం
– గీతారెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి
రాష్ట్ర ప్రభుత్వం రైతులు అధిక లాభాలు గడించేందుకు వినూత్న రీతుల్లో పంటల సాగుకు ప్రోత్సహిస్తున్నది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ప్రతి ఏఈవో క్లస్టర్ పరిధిలో వెదజల్లు పద్ధతి, స్లిట్ అప్లికేషన్, గ్రీన్ మాన్యూర్, పీఎస్బీ విధానాన్ని అమలు చేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో అమలైన ఈ విధానం యాసంగి పంటల సీజన్లో కూడా మరింత విస్తరించే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఈ విధానం ద్వారా పంటల సాగు చేస్తే రైతులు అతితక్కువ ధరలతో మంచి లాభాలు గడించేందుకు వీలుంటుంది.