వికారాబాద్, అక్టోబర్ 18 : రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. పశువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు పశువైద్యాధికారులు, పశు సంచార వాహనాలు అందుబాటులో ఉన్నాయి. పశువులపై ఎంతో మంది రైతులు, కాపరులు జీవనాలు సాగిస్తున్నారు. పశువులు ఎలాంటి అనారోగ్యం బారిన పడ్డా.. సంబంధిత పశువైద్యాధికారులు అందుబాటులో ఉండి చికిత్సలు చేస్తున్నారు. ప్రస్తుతం పశువులకు లంపీస్కిన్(ముద్ద చర్మ వ్యాధి) అనే వ్యాధి సోకింది. వికారాబాద్ జిల్లాలో 67 ఎద్దులు, ఆవులకు లంపీస్కిన్ వైరస్ సోకడంతో సరైన చికిత్సలు అందిస్తున్నారు. ఈ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటి వరకు ఒక్క పశువు కూడా మృత్యువాత పడలేదు. ఈ వ్యాధి ప్రభావం ఒక పశువు నుంచి మరోదానికి సోకుతున్నది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో తీవ్రమైన జ్వరం, కండ్లు, ముక్కు నుంచి ఎక్కువగా సొల్లు కారడం, చర్మంపై 1 నుంచి 5 సెంటీ మీటర్ల పరిమాణంలో దద్దుర్లు వస్తాయి. పాడి పశువుల పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగిన కొద్దీ, శ్వాస వ్యవస్థ దెబ్బతిని పశువులు మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువులు 5 శాతం మాత్రమే మృత్యువాత పడే అవకాశమున్నదని పశువైద్యాధికారులు తెలుపుతున్నారు. ఈ వ్యాధి మేకలు, గొర్రెలు, కుక్కలకు సోకదు. అదే విధంగా మనుషులకు ఈ వ్యాధి సోకదు. ప్రస్తుతం 15వేలకు పైగా పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేశారు.
వ్యాధి ఎలా వ్యాపిస్తుంది..
ఒక పశువు నుంచి మరో పశువుకు ఈ వ్యాధి సోకుతున్నది. వ్యాధి బారిన పడ్డ పశువును కుట్టిన దోమలు, ఈగలు, గోమార్లు, పిడుగుల (రక్తం పీల్చే బాహ్య పరాన్న జీవులు) ద్యారా వస్తుంది. కలుషితమైన మేత, నీరు, వీర్యం ద్వారా కూడా సోకే అవకాశం ఉంటాయి. ఈగలు, దోమల ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
లక్షణాలు ఎలా ఉంటాయి..
వ్యాధి సోకిన తర్వాత 1నుంచి 5 వారాల మధ్యలో కనిపిస్తాయి. మరణాల శాతం 5 శాతానికి మించనప్పటికీ మందలో 40శాతం పశువుల దాకా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదాలున్నాయి. వ్యాధి సోకిన పశువు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. కాళ్లు, పొట్ట భాగంలో నీరు చేరుతుంది. కీళ్ల వాపుతో పశువు సరిగ్గా నిలబడలేదు. 1నుంచి 5 సెంటీమీటర్ల వెడల్పుతో చర్మం మీద ముద్దలుగా దద్దుర్లు కనిపిస్తాయి. జ్వరం మొదలైన 1నుంచి2 రోజుల వరకూ చర్మం మీద లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన పశువులకు సరైన చికిత్స అందించినప్పటికీ కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్నది. చర్మం మీద మచ్చలు మాత్రం చాలా కాలం వరకు అలాగే ఉంటాయి.
నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
లంపీస్కిన్ వైరస్ ఇతర రాష్ర్టాల నుంచి మన రాష్ర్టానికి వ్యాపించింది. వ్యాక్సిన్ వేసి వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వైరస్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. జిల్లాలో 54 బృందాలు ప్రణాళిక బద్ధంగా వ్యాధి నివారణకు చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏ ఒక్క పశువు ఈ వ్యాధితో మృతి చెందలేదు. ఇతర రాష్ర్టాల నుంచి పశువులను రవాణా చేయకుండా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లాలో పశువుల సంతలు జరుగకుండా నిషేధించాం.
– అనీల్‌కుమార్,పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి, వికారాబాద్