వికారాబాద్, అక్టోబర్ 18 : గ్రామ పంచాయతీలకు అవార్డుల కోసం ఎంపిక చేసిన 54 మోడల్ గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల సమాచారాన్ని సక్రమంగా ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో పొందుపర్చాలని కలెక్టర్ నిఖిల తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత జిల్లా అధికారులతో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడతూ జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల నుంచి మోడల్ గ్రామ పంచాయతీలుగా 54 జీపీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలకు సంబంధించిన డాటా ఎంట్రీ పనులు తప్పులు దొర్లకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. వీటి ఆధారంగా ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వస్తారని, అప్లోడ్ చేసిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు, మన బడి కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ పనుల పురోగతిపై బుధవారం మండలాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అన్నింటినీ గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. వరి ధాన్యం సేకరణకు జిల్లాలో 121 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక ఇన్చార్జి అధికారిని ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం రైతుల నుంచి సేకరించాలని తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, జిల్లా వైద్యాధికారి పల్వాన్‌కుమార్, డీఈవో రేణుకాదేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనీల్‌కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని లలితాకుమారి పాల్గొన్నారు.