తాండూరు, అక్టోబర్ 18: తాండూరుతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాల్లో చోరీలకు పాల్పడిన ఇరానీ గ్యాంగ్ ముఠా దొంగలను తాండూరు పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శేఖర్‌గౌడ్, సీఐ రాజేందర్‌రెడ్డి పూర్తి వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన నవాబ్ (39), మహ్మద్‌అలీ (24) కంటి అద్దాల వ్యాపారం చేసేవారు. కష్టపడకుండా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనాలు ప్రారంభించారు. పోలీసుల యూనిఫాం, మీడియా కార్డు, సమాజ సేవ గుర్తింపు కార్డులను తయారు చేసుకొని ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ జీవనం గడుపుతున్నారు. మరో వైపు బ్యాం కులను టార్గెట్ చేస్తు జేబులో కత్తి పట్టుకొని ప్రజలను బెదిరిస్తూ దొంగతనం చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన గిరిబాబు తాండూరు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో ఉన్న తన అకౌంట్లో నుంచి రూ.22 వేలు డ్రా చేయగా మాయమాటలు చెప్పి రూ.7500 దోచుకెళ్లారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం తాండూరులోని ఓ బ్యాంకులో దొంగతనానికి ప్ర యత్నం చేస్తుండగా దొంగను పట్టుకున్నారు. వారిని పట్టుకునే సమయంలో కాని స్టేబుల్ శివను ఓ దొంగ కత్తితో దాడిచేసేందుకు ప్ర యత్నం చేయగా తప్పించుకుని పట్టుకున్నాడు. మరో దొంగ కానిస్టేబుల్ నర్సింహలును కొరికి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. పోలీసులు ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. కస్టడిలోకి తీసుకున్న పోలీసులు దొంగల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. 2019లో సదాశివపేట్, కామారెడ్డి, వీట్పల్లి ప్రాంతాల్లో దొంగతనం చేసి జైలుకు వెళ్లివచ్చారు. బెయిల్‌పై వచ్చిన వీరు మళ్లీ సంగారెడ్డి ఆర్సీ పురంలో , సదాశివపేట్‌లో మియాపూర్‌లో బీదర్‌లో , తాండూరులో దొంగతనాలకు పాల్పడ్డారు. పలు రాష్ర్టాల్లో కూడా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకున్న కానిస్టేబుల్ శివకుమార్, నర్సింహులు, సాయప్ప, షబీల్ను అభినందిస్తూ ఉన్నతాధికారులు రివార్డు ప్రకటించారు.