షాద్‌నగర్ రూరల్, అక్టోబర్ 17 : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న నానుడిని నిజం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి తండా, గ్రామం అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ రాక ముందు గత ప్రభుత్వాలు తండాలను ఓటు బ్యాంకుగా వినియోగించుకోవడమే తప్ప.. పట్టించుకున్న పాపానపోలేదు. తండాలను గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కార్… వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నది. రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, బస్సు సౌకర్యం తదితర వసతులను కల్పించి తీర్చిదిద్దుతున్నది. ఇటీవలే గిరిజనులు ఆర్థికంగా ఎదుగాలన్న సంకల్పంతో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో సీఎం కేసీఆర్‌ను దైవంగా భావిస్తున్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలో గతంలో 26 గ్రామపంచాయతీలు ఉండగా, నూతన పంచాయతీల ఏర్పాటుతో 47కు చేరింది.
నియోజకవర్గంలో 6 మండలాలు, ప్రస్తుతం 92 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మరో 64 గ్రామపంచాయతీలు నూతనంగా ఏర్పాటయ్యాయి. దీంతో గ్రామపంచాయతీల సంఖ్య 156కు చేరింది. వీటిలో ఫరూఖ్‌నగర్‌లో ప్రస్తుతం 26, నూతనంగా ఏర్పాటు చేసిన 21 గ్రామపంచాయతీలతో, మొత్తం 47 గ్రామపంచాయతీలయ్యాయి. కొత్తూరులో ప్రస్తుతం10, నూతనంగా ఏర్పడిన నాలుగు గ్రామపంచాయతీలతో మొత్తం 14 గ్రామపంచాయతీలయ్యాయి. నందిగామలో ప్రస్తుతం 8, నూతనంగా 10 పంచాయతీలు, కొందుర్గులో ప్రస్తుతం 15, నూతనంగా 7 కలుపుకొని మొత్తం 22 పంచాయతీలయ్యాయి. కేశంపేటలో ప్రస్తుతం 19, నూతనంగా 10, మొత్తం 29 గ్రామపంచాయతీలున్నాయి. చౌదరిగూడెంలో ప్రస్తుతం 14, నూతనంగా 10 పంచాయతీలతో మొత్తం 24 గ్రామపంచాయతీలుగా మారాయి.
ఫరూఖ్‌నగర్ మండలంలో మేళబావి తండా, వెంకమ్మగూడ తండా, శేరిగూడ, దేవునిబండా తండా, చిన్నచిల్కమర్రి, కడియల కుంటతండా, కుందేలు కుంట తండా, నేరాలచెరువు, కసిరెడ్డిగూడ, రామేశ్వరం, మోండోనిరాయి తండా, పుచ్చర్ల కుంట తండా, గిరాయగుట్ట తండా, వెంకట్‌రెడ్డిపల్లి, ఉప్పరి గడ్డ, ఎల్లంపల్లి, రంగంపల్లి, దొంతి కుంట తండా, పీర్లగూడెం, చౌడమ్మగుట్ట తండా, రాసుమళ్లగూడెం నూనత గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి.
తండాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగా 2,637 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గత ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇటీవల గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– రాంబల్‌నాయక్, ఎస్టీ, ఎస్సీ కమిషన్ సభ్యుడు
ఒకప్పుడు అధ్వానంగా ఉన్న రామేశ్వరం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. నూతన పంచాయతీగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశాం. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. గ్రామస్తుల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తా.
– సంపత్, సర్పంచ్, రామేశ్వరం, ఫరూఖ్‌నగర్ మండలం