షాబాద్/బొంరాస్‌పేట, అక్టోబర్ 17 : ఉపాధి హామీ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న కూలీలకు మరింత ధీమానిచ్చే నిర్ణయం తీసుకున్నది. ప్రమాద బీమాను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గరిష్ఠంగా రూ. 50వేలు ఉన్న బీమాను ఇప్పుడు రూ. 2లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు గాయపడటం, కాళ్లు, చేతులు విరగడం, పక్షవాతం బారిన పడడం, గునపాలు గుచ్చుకోవడం, పాముకాట్లు, వడదెబ్బ వంటి ప్రమాదాలు జరిగి మృతి చెందినా ఇదివరకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కష్టాన్ని నమ్ముకుని గుట్టలు, పొలాలు, చెరువుల్లో పనిచేసే కూలీల కష్టాన్ని అర్థం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఉమ్మడి జిల్లాలోని కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అడవులు, గుట్టలు, చెట్ల పొదల్లో పనులు చేస్తుంటాం. ప్రమాదం జరిగి కూలీలు చనిపోతే వారి కుటుంబానికి పరిహారం అందజేసి భరోసా కల్పించడం సంతోషకరం. కూలీలకు కొండంత అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూలీలంతా రుణపడి ఉంటారు.
– పల్లె రామకృష్ణారెడ్డి, బొంరాస్‌పేట
బీమా పరిహారం పెంపు వల్ల ఉపాధి హామీ కూలీలకు ఎంతో ప్రయోజనం చేకూరనున్నది. ప్రమాదవశాత్త్తు మృతి చెందినా, గాయపడినా బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పెంచినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– కృష్ణన్, డీఆర్డీవో
ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. పలువురు మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. బాధిత కుటుంబానికి బాసటగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని పెంచడం సంతోషకరం.
– కావలి శ్రీనివాస్, అల్లికాన్పల్లి, దుద్యాల మండలం