‘మన ఊరు-మన బడి’తో గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1309 పాఠశాలలుండగా, మొదటి విడుతలో 464 స్కూళ్లను అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే 438 పాఠశాలల కోసం రూ.168.65 కోట్లను ప్రభుత్వం అందించగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వంట గదులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, పార్కుల సుందరీకరణ, భవనాలకు పెయింటింగ్, ఆట స్థలాల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 319 పాఠశాలల్లో పనులు పూర్తికాగా సరికొత్తరూపు సంతరించుకున్నాయి.
రంగారెడ్డి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి చదువుకు సంబంధించి సరైన వసతులు అందేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏ ఒక్క విద్యార్థికీ అసౌకర్యం కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా.. రాష్ట్రంలోని పలు పాఠశాలల అభివృద్ధి నిమిత్తం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతో పాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం కింద రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొదటి విడుతలో భాగంగా జిల్లాలో 464 పాఠశాలలను పురోభివృద్ధిలోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలకు సంబంధించిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. తరగతి గదులు అదనంగా కావాల్సిన చోట గదులను నిర్మిస్తున్నారు. ఇంకా వంట గదులు, సుందరీకరణ పార్కులు, బ్యూటిఫికేషన్, ఆట స్థలాలను తీర్చిదిద్దుతున్నారు.
ప్రభుత్వ బడులను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు, విద్యా విప్లవానికి ఈ కార్యక్రమం నాంది పలుకనున్నది. మన పాఠశాలల్లో 12 రకాల మార్పులు త్వరితగతిన సంతరించుకోనున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలల వాతావరణం చూడగానే ముచ్చటేసేలా, ఇష్టపడేలా సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. గ్రీనరీ, ఆట స్థలాలు, పాత్‌వేలను నిర్మిస్తున్నారు. కాగా, ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం యావత్తు దేశానికి రోల్‌మోడల్‌గా నిలువనుంది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే తేడా స్పష్టంగా అగుపించనుంది. ముందు బడులకు, ప్రస్తుత బడులకు తేడా కొట్టొచ్చినట్టు కనిపించనుంది. ప్రతి ప్రభుత్వ బడి ఒక కార్పొరేట్ బడిని తలపించేలా తీర్చిదిద్దబడుతున్నది.
రంగారెడ్డి జిల్లాలో 1309 పాఠశాలలున్నాయి. ప్రాథమిక పాఠశాలలు 882, ప్రాథమికోన్నత పాఠశాలలు 179, ఉన్నత పాఠశాలలు 248 ఉన్నాయి. ఈ కార్యక్రమం కింద మొదటి విడుతగా జిల్లాలో 464 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి, వాటిని తీర్చిదిద్దనున్నారు. ఇందులో 257 ప్రైమరీ స్కూల్స్, 60 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 147 హైస్కూల్స్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 303 పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లో 161 పాఠశాలలున్నాయి. కాగా, జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో భాగంగా రూ.168.65 కోట్ల నిధులు కేటాయించారు. అందులో 438 పాఠశాలలకు నిధులు కేటాయించారు. మరికొన్నింటికి నిధులు అందాల్సి ఉంది. అయితే, ఆయా పాఠశాలలను బట్టి రెండు నిధుల కేటగిరీలు ఉన్నాయి. రూ.30 లక్షల లోపు, రూ.30 లక్షల పైబడిన కేటగిరీలు. జిల్లాలోని 27 మండలాల్లో రూ.30 లక్షలకు లోబడిన బడ్జెట్ ప్రాజెక్టులో 342 పాఠశాలలు వచ్చాయి. రూ.30 లక్షలకు మించిన బడ్జెట్ ప్రాజెక్టులో 96 పాఠశాలలు ఉన్నాయి. 438 పాఠశాలలకుగాను 94.4% నిధులు మంజూరయ్యాయి. రూ.30 లక్షల కేటగిరీలో 319 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. 23 చోట్ల పనులు కొనసాగాల్సి ఉంది. ఈ విభాగంలో 93% పనులు కొనసాగుతున్నాయి. కాగా, రూ.30 లక్షల పైబడిన కేటగిరిలో ఒక పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఈ విభాగంలో 95 పాఠశాలల్లో పనులు పూర్తి కాలేదు.
రాష్ట్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యా విభాగం ప్రధానమైనది. విద్యార్థుల అభ్యసనానికి సంబంధించి ప్రభుత్వం ముందు చూపుతో అడుగులు వేస్తున్నది. విద్యార్జనలో ఏ ఒక్క విద్యార్థికీ లోటు జరగొద్దు. మౌలిక వసతుల కల్పనకు కొరత ఉండొద్దు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చర్యలు చేపడుతున్నది. అందులో భాగమే.. ఈ ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం. పలు పాఠశాలలకు దిద్దుబాటు కార్యక్రమంలో మంచి వసతులు, వాతావరణం, నైపుణ్యం గల బోధనా సిబ్బందిని కేటాయించనున్నారు. దీని ద్వారా మన పాఠశాలలు అత్యుత్తమ అభ్యసన కేంద్రాలుగా తీర్చిదిద్దబడనున్నాయి. విద్యార్థులకు చక్కనైన విద్య, అవకాశాలు అందుతాయి.
– సుశీందర్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా