వికారాబాద్, అక్టోబర్ 16:ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. పరీక్షా సమయానికి ముందే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి సెంటర్లలోకి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 128 పరీక్షా సెంటర్లలో పరీక్ష నిర్వహించగా, 51,718 మందికిగాను 34,692 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, 4,857 మందికిగాను 4,024 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పలు పరీక్షా కేంద్రాలను రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్, వికారాబాద్ కలెక్టర్ నిఖిల తనిఖీలు చేశారు. ఆయా కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా జరిపిన వేలిముద్రల సేకరణపై ఇరు జిల్లాల కలెక్టర్లు ఆరా తీశారు. పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, ఇతర సామగ్రిని నిబంధనలకు అనుగుణంగా సీల్ వేసి పోలీస్ ఎస్కార్ట్ నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 4,857 మందిఅభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,024 మంది మాత్రమే హాజరు కాగా 833 మంది గైర్హాజరయ్యారు. హాజరు 82.8 శాతంగా నమోదైంది. కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లోకి అభ్యర్థులను ఉదయం 8:30 నుంచే సిబ్బంది తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1గంట వరకు జరిగింది. పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను వికారాబాద్ కలెక్టర్ నిఖిల పరిశీలించారు. ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ ఆర్టీసీ అధికారులు 68 బస్సులను వివిధ రూట్లలో నడిపి అభ్యర్థులకు సహకరించారు. వికారాబాద్‌లోని బస్టాండ్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్ మహేశ్‌కుమార్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పా టు చేసి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల వివరాలు తెలియజేశారు. పోలీసులు సైతం పూర్తి బందోబస్తు నిర్వహించారు. కాగా ఎస్ఏపీ కళాశాలలోని కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు.
రంగారెడ్డి జిల్లాలో 128 కేంద్రాల్లో..
షాబాద్, అక్టోబర్ 16: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రంగారెడ్డిజిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగిం ది. జిల్లాలోని 12 మండలాల్లో చేవెళ్ల, మొయినాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లి, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, గండిపేట, సరూర్‌నగర్, మహేశ్వరం మండలాల్లో 128 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 51,718 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 34,692 మంది పరీక్షకు హాజరు కాగా, 17,026 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఉదయం లక్డికాపూల్ స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం నుంచి కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య ఆయా రూట్ల వారీగా ప్రశ్నాపత్రాలు, ఇతర సామగ్రిని ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1గంట వర కు పరీక్ష జరిగింది. పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, ఇతర సామగ్రిని నిబంధనలకు అనుగుణంగా సీల్ వేసి పోలీస్ ఎస్కార్ట్ మ ధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈ ప్రక్రియను కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ పర్యవేక్షించడంతోపాటు వీడియో రికార్డింగ్ చేయించారు. అధికారులు అన్ని చర్యలు తీసుకోవడంతో పరీక్ష సజావుగా జరిగింది. ఆర్టీసీ డిపోల వద్ద అభ్యర్థులకు సహాయంగా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాల వివరాలను తెలియజేశారు.
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అమయ్‌కుమార్
జిల్లాలో జరిగిన గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ తనిఖీ చేశారు. వనస్థలిపురం లయోలా మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా మాదాపూర్, నార్సింగి, మొయినాబాద్ కేంద్రాలను అదనపు కలెక్టర్ తిరుపతిరావు సందర్శించి పరిశీలించారు. అభ్యర్థులు, సిబ్బంది హాజరుపై కలెక్టర్ అమయ్‌కుమార్ ఆరా తీశారు. కేంద్రాల్లో తాగునీటితోపాటు ఇతర వసతులను కల్పించారా లేదా అని గమనించారు. ఆయన వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైజనింగ్ అధికారులు ఉన్నారు.