షాబాద్, అక్టోబర్ 16: తెల్లబంగారంతో అన్నదాత ఇంట సిరులు కురువనున్నాయి. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలో 1,35,193 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ నెల చివరినాటికి పంట చేతికొచ్చే అవకాశమున్నది. పత్తి బాగా కాయడంతో సుమారు 10,81,545 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు జిల్లాలో 14 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వచ్చే నెల మొదటి వారం నుంచి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఈసారి క్వింటాల్‌కు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలుక నున్నదని రైతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పత్తిపంట దిగుబడులపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పత్తిసాగు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది వానకాలంలో రైతులు 1,35,193 ఎకరాల్లో పత్తిపంట సాగు చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. పంటను తెగుళ్ల నుంచి కాపాడుకొని అధిక దిగుబడులు సాధించేందుకు అహర్నిషలు శ్రమిస్తున్నారు. ఈ నెల చివరి నాటికి పంట చేతికొచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు పంట కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. పత్తికి ప్రస్తుతం ప్రభుత్వ మద్ధతు ధర రూ. 6,380 పలుకుతుండగా పంట చేతికి వచ్చే సమయానికి బహిరంగ మార్కెట్లో ధర రూ. 8వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతుందని రైతులు అంచనా వేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 1,35,193 ఎకరాల్లో పంట సాగు
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కందుకూరు, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 26 మండలాల్లో ఈ ఏడాది వానకాలం సీజన్‌కు గాను 1,35,193 ఎకరాల్లో రైతులు పత్తిపంట సాగు చేసిన్నట్లు సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. డివిజన్ల పరిధిలోని మండలాల వారీగా పత్తిపంట సాగు చూసుకుంటే.. చేవెళ్ల మండలంలో 9,510 ఎకరాలు, మొయినాబాద్ 776, షాబాద్ 9,348, శంకర్పల్లి 3,713, అబ్దుల్లాపూర్మేట్ 87, హయత్‌నగర్ 0, ఇబ్రహీంపట్నం 166, మాడ్గుల 50,133, మంచాల 2,028, యాచారం 4,504, ఆమనగల్లు 9,362, బాలాపూర్ 3, కడ్తాల్ 6,734, కందుకూర్ 1,140, మహేశ్వరం 2,532, గండిపేట్ 1, రాజేంద్రనగర్ 0, శేరిలింగంపల్లి 0, శంషాబాద్ 723, ఫరూఖ్‌నగర్ 1,847, చౌదరిగూడెం 4,484, కేశంపేట 7,228, కొందుర్గు 8,059, కొత్తూర్ 1,943, నందిగామ 2,718, తలకొండపల్లి 8,142తో కలిపి మొత్తం జిల్లాలో 1,35,193 ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేయగా, 10,81,545 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని అంచనా వేసిన్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 14 కొనుగోలు కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 14 జిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. పాలమూర్ కాటన్ ట్రెడర్స్(ఫరూఖ్‌నగర్), రాఘవేంద్ర కాటన్ కార్పొరేషన్(ఫరూఖ్‌నగర్), చిరాగ్ కాటన్ కార్పొరేషన్(ఫరూఖ్‌నగర్), శ్రీనివాస కాటన్ ఇండస్ట్రీస్(కొందుర్గు), శ్యామ్ కాటన్ ఇండియా ఫ్రైవేట్ లిమిటెడ్(ఫరూఖ్‌నగర్), వినాయక కాటన్ మిల్స్(నందిగామ), హరిహర జిన్నింగ్ మిల్(నందిగామ), వెంకటేశ్వర ట్రెడర్స్(నందిగామ), తుల్జాభవాని కాటెక్స్(నందిగామ), గురువ ఇండస్ట్రీస్(ఫరూఖ్‌నగర్), తిరుమల టెడింగ్ కంపనీ(నందిగామ), శ్రీనివాస మురుగన్ ఇండస్ట్రీస్(తలకొండపల్లి), శ్రీ అభిషేక్ కాటన్ మిల్స్(ఆమనగల్లు), కిసాన్ జిన్నింగ్(ఆమనగల్లు)మిల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి. ఆయా యాజమాన్యాలు కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాయి.
మంచి దిగుబడులు వస్తాయి..
ఈ ఏడాది పత్తిపంటలో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. నేను పది ఎకరాల పొలంలో పత్తిపంట సాగు చేశాను. వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించి ఎరువులు, మందులు పిచికారీ చేశాను. పంట కాత దశలో మంచిగా ఉంది. వాతావరణం అనుకూలించడంతో పాటు ప్రస్తుత మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉండడంతో ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
– గంగాపురం యాదిరెడ్డి, రైతు బోడంపహాడ్(షాబాద్)
14 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రైతుల నుంచి పత్తి సేకరించేందుకు గాను 14 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశాం. జిన్నింగ్ మిల్స్ యాజమాన్యం సీసీఐ టెండర్లలో పాల్గొన్న వెంటనే నోటీఫైడ్ చేస్తాం. ప్రస్తుతం పత్తికి క్వింటాళ్లుకు ధర రూ. 6,380 ఉంది. ధళారుల వద్ద పత్తి విక్రయించి రైతులు మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నవంబర్ మొదటి వారంలో జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయి.
–ఛాయాదేవి, రంగారెడ్డి జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి