బొంరాస్‌పేట, అక్టోబర్ 16 : రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు ఆత్మీయులను కోల్పోయిన కుటుంబం కష్టాల్లో కూరుకుపోతున్నది. ఇంటి పెద్దదిక్కు దూరమైనా, తీవ్రంగా గాయాలపాలైనా కుటుంబ సభ్యులు ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి ఆపద సమయంలో ఆదుకునేవి ప్రమాద బీమా పథకాలే. ఇదే క్రమంలో తపాలా శాఖ టాటా ఏఐజీతో కలిసి సామూహిక ప్రమాద బీమా (గ్రూపు యాక్సిడెంట్ గార్డ్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో వార్షిక ప్రీమియం రూ.399లు చెల్లిస్తే చాలు రూ.10 లక్షల బీమా వర్తిస్తున్నది. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ద్వారా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్‌కు ధీమాగా నిలిచే ఈ పథకం వివరాలు.
చేకూరే ప్రయోజనాలు
సామూహిక ప్రమాద బీమా పథకానికి 18-65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం బారిన పడినా రూ.10 లక్షలు చెల్లిస్తారు.
పాలసీ పొందిన వ్యక్తి ప్రమాదానికి గురై వైద్యం కోసం దవాఖానల్లో చేరితే ఇన్ పేషంట్ డిపార్ట్మెంట్ కింద రూ.60 వేలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తం ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. ఓపీ కింద రూ.30వేలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తం. ఏది తక్కువైతే అది చెల్లిస్తారు.
వీరు అనర్హులు
సాహస క్రీడల్లో పాల్గొనేవారు, ఆర్మీ, నేవీ, ఏయిర్‌ఫోర్స్, పోలీసు శాఖల్లో పనిచేసేవారు, డ్రైవింగ్ వృత్తితో సంబంధం ఉన్నవారు ఈ పథకంలో చేరడానికి అనర్హులు. ఆత్మహత్య చేసుకున్నా, దోమకాటు వల్ల వచ్చే వ్యాధులతో మృతిచెందినా, డ్రగ్స్, ఆల్కహాల్ ప్రభావంతో మరణించినా, నేరం, అల్లర్లు పేలుళ్లలో చనిపోయినా, ప్రసవ సమయం, గర్భంవల్ల కలిగే హాని, ఎముకల వ్యాధితో మృతిచెందినా బీమా వర్తించదు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రమాద బీమా పథకం చాలా మంచి పథకం. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు కలిగే విధంగా తపాలా శాఖ బీమా పథకాన్ని రూపొందించింది. ఇందులో చేరాలనుకునేవారు సమీపంలోని తపాలశాఖ కార్యాలయంలో సంప్రదించాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–సీహెచ్, శ్రీనివాసరావు, పోస్టల్ సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్