రంగారెడ్డి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఆదివారం (నేడు) జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో 12 మండలాల్లో 128 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 51,718 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. ఉదయం 10:15కు పరీక్షా కేంద్రం గేట్లు మూతపడనున్నాయి. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించరు. పరీక్ష నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు కీలక భూమిక పోషించనున్నారు.
25 మంది తహసీల్దార్లు లైజనింగ్ ఆఫీసర్లుగా, 128 మంది అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లుగా విధులు నిర్వహించనున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లి, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, గండిపేట్, సరూర్‌నగర్, మహేశ్వరం మొదలైన 12 మండలాల్లో 25 రూట్లను ఏర్పాటు చేశారు. ప్రతి అభ్యర్థికి సంబంధించి బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు తప్పనిసరిగా సేకరించనున్నారు. ప్రతి 60 మంది అభ్యర్థులకు ఒక బయోమెట్రిక్ యూనిట్‌ను అందుబాటులో ఉంచారు.
సందేహాలు, సమస్యలుంటే సంప్రదించండి..
ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఎవరికైనా సందేహాలు, సమస్యలుంటే వాటిని పరిష్కరించుకునేందుకు జిల్లాస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులను 040-23235642, 040-23235643లలో సంప్రదించవచ్చు.
రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోండి
– అమయ్‌కుమార్, రంగారెడ్డి కలెక్టర్
బయో మెట్రిక్ విధానం తప్పనిసరి కావడంతో అభ్యర్థులు నిర్ణీత సమయానికి రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష సమయం అయిపోయేంత వరకు హాల్‌ను విడిచి వెళ్లొద్దు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు లేవు. అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, ఓఎంఆర్ జవాబు పత్రంలో బుక్లెట్ల సంఖ్య, వేదిక కోడ్ సరిగ్గా వేయాలి. బుక్లెట్ల సిరీస్ ఏ, బీ, సీ, డీ నుంచి ఆరు అంకెల సంఖ్యకు మార్చారు. జవాబు పత్రంపై వైట్నర్ గాని, చాక్‌పౌడర్ గాని, బ్లేడ్ గాని, ఎరేజర్ గాని ఉపయోగించొద్దు.
అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు..
అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తోపాటు ఒక ఐడీ ఒరిజనల్(ఆధార్/పాన్‌కార్డు/ ఓటర్ ఐడీ/ఎంప్లాయి ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్/పాస్‌పోర్ట్)ను తీసుకురావాలి. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి రావాలి. బూట్లతో వస్తే అనుమతించరు. పరీక్షకు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే తీసుకురావాలి. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులెవరూ పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లకూడదు.
హాల్ టికెట్‌పై ఫొటో/సంతకం లేకపోతే..
అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్‌ను, కేంద్రాలను సరిచూసుకోవాలి. హాల్ టికెట్‌పై ఫొటో/సంతకం లేకపోతే వారు గెజిటెడ్ అధికారిచే సక్రమంగా ధ్రువీకరించిన మూడు పాస్‌పోర్టు ఫొటోలు తీసుకురావాలి. నిర్ణీత ప్రొఫార్మాలో పరీక్షా కేంద్రంలో వాటిని అప్పగించాలి.
తొలిసారిగా గ్రూప్-1 పరీక్షకు బయోమెట్రిక్ విధానం
వికారాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ పట్టణంలో 13 పరీక్షా కేంద్రాలు, పూడూరు మండలంలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 4857 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తొలిసారిగా గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ రూం ప్రవేశ ద్వారంతోపాటు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష మొదలు పూర్తయ్యే వరకు వీడియోను చిత్రీకరించనున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంతోపాటు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతోపాటు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ను అమలుచేయనున్నారు.
పరీక్ష సజావుగా జరిగేందుకు నలుగురు లైజన్ అధికారులతోపాటు 14 మంది సహాయ లైజన్ అధికారులను నియమించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా 68 బస్సులను నడుపనున్నారు. జిల్లాలోని తాండూరు-వికారాబాద్ మధ్య 6 బస్సులు, వికారాబాద్-శంకర్‌పల్లికి 5 బస్సులు, వికారాబాద్-పరిగికి 7 బస్సులు, చేవెళ్ల-శంకర్‌పల్లికి 6 బస్సులు, పరిగి-హైదరాబాద్‌కు 15 బస్సులు, వికారాబాద్-సదాశివపేట్‌కు 9 బస్సులు, వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి-ఎస్ఏపీ కాలేజీకి రెండు బస్సులు, వికారాబాద్ నుంచి చేవెళ్లకు 3 బస్సులు, వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి భృంగీ స్కూల్ వరకు రెండు బస్సులతోపాటు మరిన్ని రూట్లకు ప్రత్యేకంగా బస్సులను నడుపనున్నారు.
ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాయండి : విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి
ఇంత కాలం పరీక్షల కోసం అహర్నిశలు శ్రమించిన గ్రూప్-1 అభ్యర్థులకు ‘ఆల్ ది బెస్ట్’.. పరీక్షలకు హాజరవుతున్న ప్రతిఒక్కరికీ అభినందనలు అని మంత్రి సబితారెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు త్వరగా పరీక్షా కేంద్రం చేరుకొని, ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని కోరారు. పరీక్షలో మంచి ప్రతిభను చూపి తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.