కోట్పల్లి అక్టోబర్ 15 : చెరుకు పంట సిరులు కురిపించనున్నది. మండలంలోని జిన్నారం, నాగ్సాన్పల్లి, ఎన్కెపలి, ఎన్నారం, బుగ్గాపూర్, ఇందోల్, ఒగ్లాపూర్ తదితర గ్రామాల్లో రైతులు అధికంగా చెరుకు సాగు చేశారు. అధికంగా జిన్నారం, నాగ్సాన్పల్లి తదితర గ్రామాల్లో 250 ఎకరాల పైబడి, ఇతర గ్రామాల్లో 100 నుంచి 150 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయాధికారుల అంచనా. ఒక ఎకరానికి రూ.35 వేల పెట్టుబడి పెట్టి చెరుకు సాగు చేస్తే 3 నుంచి 5 సంవత్సరాలు దిగుబడి వస్తుంది. ఎకరాకు 60 టన్నుల దిగుబడి రానున్నది.
ఈసారి చెరుకుకు టన్నుకు రూ.3800 వరకు ధర పలుకుతుండడంతో ఎకరా సాగు చేసిన రైతుకు రూ.1.45 లక్షల వరకు ఆదాయం రానున్నదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే చెరుకు గడలకు పూర్తిగా పువ్వు రాగానే సంగారెడ్డి గణేశ్ ఫ్యాక్టరీ నిర్వాహకుల వద్దకు వెళ్లి పంటను అమ్మినాక లారీల్లో తీసుకెళ్తారు. మరి కొందరు స్వయంగా ఎడ్ల బండి, ట్రాక్టర్లలో చెరుకు తీసుకెళ్లి విక్రయిస్తారు.
చెరుకుతో మంచి లాభాలు ..
నాలుగు ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేశా. ఎకరాకు దాదాపుగా రూ.35 వేల పెట్టుబడి అయ్యింది. మొదటి సంవత్సరం నాలుగు ఎకరాలకు పెట్టుబడి పోను రూ.లక్షా 80 వేల పైబడి ఆదాయం రానున్నది. ఏటా 2 లేదా 4 ఎకరాల్లో చెరుకును పండిస్తున్నా.
– సిరిపురం మల్లేశం, జిన్నారం గ్రామ రైతు
రెండెకరాల్లో సాగు చేసినా..
రెండు ఎకరాల్లో చెరుకు పంటను వేశాను. మిగతా 4 ఎకరాల్లో పూల తోట వేసుకున్నా. ఒక్క సారి చెరుకు పంటను వేసుకుంటే 3 నుండి 5 సంవత్సరాలు దిగుబడి వస్తుంది. ఈసారి లాభాలు వస్తాయని ఆశిస్తున్నా.
– నారేగుడెం మల్లారెడ్డి, నాగ్సాన్పల్లి గ్రామ రైతు
మండలంలో 400 ఎకరాలకు పైగా సాగు..
మండలంలో దాదాపుగా 400 ఎకరాలకు పైగా రైతులు చెరుకు సాగు చేశారు. ఎకరాకు రూ.35 నుంచి రూ.40 వేల పెట్టుబడి వస్తుంది. గడిచిన ఏడాది దాదాపుగా 250 ఎకరాల్లో చెరుకు సాగు చేయగా, ఈసారి రెట్టింపైంది. పంట సైతం బాగా పండడంతో రైతులకు లాభాలు రానున్నాయి.
– పాండురంగాచారి, కోట్పల్లి మండల వ్యవసాయాధికారి